విజయ్ దేవరకొండ ఎందుకు అప్పు చేశాడంటే?
on May 3, 2020

'అర్జున్ రెడ్డి'తో విజయ్ దేవరకొండ యంగ్ స్టార్ హీరోల రేసులోకి వచ్చాడు. 'గీత గోవిందం' విజయంతో మరో మెట్టు ఎక్కాడు. ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకడు. అతడితో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు నిర్మాతలు క్యూ కడుతున్నారు. కోట్లలో పారితోషికం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి హీరోకి అప్పు చేయాల్సిన అవసరం ఉందంటే ఎవరైనా నమ్ముతారా? అందువల్లే, కరోనా కాలంలో మధ్యతరగతి కుటుంబాలకు సాయం చేయడానికి 'మిడిల్ క్లాస్ ఫండ్' ఏర్పాటు చేసినప్పుడు స్నేహితుల దగ్గర కొంత అప్పు తీసుకున్నానని విజయ్ దేవరకొండ చెబితే ఆశ్చర్యపోయారంతా! 'మీకు అప్పు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?' అని అతనిని అడిగితే ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు.
"కరోనా వస్తుందని, ఆర్థిక ఇబ్బందులు వస్తాయని ముందుగా ఎవరూ ఊహించరు కదా? నేనూ అంతే! ఇటువంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. సేవింగ్స్ పెట్టుకోలేదు. ఎప్పుడు వచ్చిన డబ్బులు అప్పుడు ఖర్చు పెట్టేస్తుంటా. ఇటీవలే కొత్త ఇల్లు కొన్నాను. అందుకు కొంత డబ్బు ఖర్చు అయింది. మా నిర్మాణంలో కొత్త సినిమా ఒకటి మొదలుపెట్టాం. అందులో కొంత డబ్బు స్టక్ అయింది. గత ఏడాది దేవరకొండ ఫౌండేషన్ ప్రారంభించా. దానికి 40 లక్షలు ఖర్చు పెట్టా. కరోనా వస్తుందని ఊహించలేదు. నాకు వచ్చిన డబ్బులు ఒక ప్లాన్ ప్రకారం ఖర్చుపెట్టా. ఇప్పుడు షూటింగులు ఆగిపోవడంతో ఇబ్బంది ఎదురైంది. మళ్లీ షూటింగులు మొదలై తప్ప నాకు డబ్బులు రావు. అందుకని, అప్పు చేశా. షూటింగులు మొదలైతే ఐదారు నెలల్లో అప్పులు తీర్చేస్తా" అని విజయ్ దేవరకొండ చెప్పాడు.
ఎంత అప్పు చేశాననేది మాత్రం అడగొద్దని విజయ్ దేవరకొండ అన్నాడు. అది తన వ్యక్తిగత విషయమని స్పష్టం చేశాడు. రెండు మూడు నెలలు ఇంటిలో అవసరాలు, స్టాఫ్ జీతాలు ఇవ్వడానికి సరిపడా డబ్బులు అప్పు చేశానని తెలిపాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



