ఇండస్ట్రీ హిట్ `చంటి`కి 30 ఏళ్ళు!
on Jan 10, 2022

తెలుగునాట రీమేక్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ లా నిలిచిన కథానాయకుల్లో విక్టరీ వెంకటేశ్ ఒకరు. అలా వెంకీ నటించిన రీమేక్ చిత్రాల్లో `చంటి`కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాతోనే కెరీర్ లో తొలి ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు వెంకటేశ్. తమిళ చిత్రం `చిన్న తంబి` (1991) (ప్రభు, ఖుష్బూ) ఆధారంగా రూపొందిన ఈ సినిమా.. వెంకీ కెరీర్ ని `చంటి`కి ముందు, తరువాత అన్నంతగా ప్రభావితం చేసింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేశ్ కి జంటగా మీనా నటించగా.. సుజాత, నాజర్, మంజుల, బ్రహ్మానందం, వినోద్, ప్రసన్న కుమార్, అల్లు రామలింగయ్య, మహర్షి రాఘవ, సుధారాణి, అనూజ, మాస్టర్ రాఘవేంద్ర ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా బాణీలతో రూపొందిన ఈ చిత్రంలోని పాటలకు వేటూరి, సాహితి సాహిత్యమందించారు. ``ఎన్నెన్నో అందాలు``, ``పావురానికి పంజరానికి``, ``అన్నుల మిన్నుల``, ``జాబిలికి వెన్నెలకి`` (రెండు వెర్షన్స్), ``ఓ ప్రేమా`` (రెండు వెర్షన్స్), ``ఇది తైలం``.. ఇలా ఇందులోని గీతాలన్ని విశేషాదరణ పొందాయి. `ఉత్తమ గీత రచయిత` (వేటూరి), `ఉత్తమ గాయకుడు` (ఎస్పీ బాలు), `ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్` (శోభలత), `ఉత్తమ ప్రతినాయకుడు` (నాజర్) విభాగాల్లో `నంది` పురస్కారాలు అందుకున్న `చంటి`.. 40కి పైగా కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని అప్పట్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. హిందీలో `అనారి` (1993) పేరుతో రీమేక్ కాగా.. ఆ సినిమాతో వెంకీ బాలీవుడ్ డెబ్యూ ఇచ్చి విజయం అందుకున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్. రామారావు నిర్మించిన `చంటి`.. సంక్రాంతి కానుకగా 1992 జనవరి 10న విడుదలై అఖండ విజయం సాధించింది. నేటితో ఈ మ్యూజికల్ సెన్సేషన్ 30 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



