కళాభవన్ మణిని చంపింది అదేనా..?
on May 29, 2016
విలక్షణ నటుడు కళాభవన్ మణి మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఆయన దేహంలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్ అవశేషాలు కనుగొన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌కు చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం వెలుగు చూసింది. అయితే ఆయన చనిపోయిన తర్వాత నిర్వహించిన పోస్ట్‌మార్టం పరీక్షల్లోనే మణి శరీరంలో ప్రమాదకరమైన క్రిమిసంహారిణి క్లోర్ పరిఫోస్ అవశేషాలు ఉన్నట్టు కొచ్చిలోని కక్కనాడ్ ప్రాంతీయ రసాయన పరీక్షా కేంద్రం వెల్లడించింది. మళయాళంతో పాటు పలు భాషల్లో 200 సినిమాల్లోనటించిన కళాభవన్ మణి ఈ ఏడాది మార్చి 6న అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఫోరెన్సిక్ నివేదిక కూడా కొచ్చి ల్యాబ్ లాగే నివేదిక వెల్లడించడంతో కేసు కీలక మలుపు తిరిగింది.