Touch Me Not Review: టచ్ మీ నాట్ వెబ్ సిరీస్ రివ్యూ
on Apr 5, 2025
వెబ్ సిరీస్: టచ్ మీ నాట్
నటీనటులు: నవదీప్, దీక్షిత్, కోమలి ప్రసాద్, సంచితా పూనాచ, పృథ్వీ రాజ్, ప్రమోదిని, దేవి ప్రసాద్ తదితరులు
రచన: చార్వీ మురారి
ఎడిటింగ్: అన్వర్ అలీ
సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి
మ్యూజిక్: మహతి స్వర సాగర్
నిర్మాతలు: సునీతా తాటి, వంశీ బండారు
దర్శకత్వం: రమణ తేజ
ఓటిటి: జియో హాట్ స్టార్
నవదీప్, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ 'టచ్ మీ నాట్'. జియో హాట్ స్టార్ లో రిలీజైన ఈ సిరీస్ కథేంటో ఓసారి చూసేద్దాం...
కథ:
హైదరాబాద్ లోని ఓ ఏరియాలో గల మారుతీ అపార్ట్మెంట్ లో రాత్రివేళ నలుగురు మహిళలని ఓ దుండగుడు అత్యంత దారుణంగా హత్య చేస్తాడు. ఆ తర్వాత గ్యాస్ లీక్ చేసి వెళ్ళిపోతాడు. ఆ ప్రమాదంలో ఎంతో మంది చనిపోతారు. రాఘవ్(నవదీప్) తన తల్లిని, రిషి(దీక్షిత్ శెట్టి) తన తల్లిదండ్రులని కోల్పోతారు. మళ్ళీ కొన్ని సంవత్సరాలకి రిషి, రాఘవ్ కలుసుకుంటారు. కాలేజీలో రిషికి మేఘ(కోమలి ప్రసాద్) పరిచయమవుతుంది. మరోవైపు రాఘవ్ తో పాటు పనిచేసే దేవిక(సంచిత పూనాచా) ఆయనని ఇష్టపడుతుంది. అదే సమయంలో ఓ హాస్పిటల్లో అగ్నిప్రమాదం జరుగుతుంది. ఈ ప్రమాదంలో ఇరవై మంది పేషంట్లు చనిపోతారు. దాంతో మారుతి అపార్టుమెంటు కేసుపైకి మరోసారి తెరపైకి వస్తుంది. అప్పటి సంఘటనకు కారణమైనవారే, ఇప్పటి సంఘటనకు పాల్పడి ఉంటారనే సందేహం తలెత్తుతుంది. ఆ విషయం తెలుసుకోవడానికి గాను, రిషిని ఉపయోగించుకోవాలని రాఘవ అనుకుంటాడు. తన సైకో మెట్రి శక్తితో రిషి ఏం చెప్తాడు? అసలు హంతకుడు ఎవరనేది మిగతా కథ.
విశ్లేషణ:
ఒక ప్రమాదంలో మనిషి గతాన్ని మర్చిపోవడం చాలా సినిమాల్లో చూశాం. కానీ ఈ సిరీస్ లో మనిషికి ఓ సూపర్ పవర్ వస్తుంది. అదే 'సైకో మెట్రి'. అంటే ఏదైనా వస్తువుని తాకినా, మనుషులని తాకినా గతంలో ఏం జరిగిందో చెప్పగల శక్తి అతనికి లభిస్తుంది. ఇక ఈ అంశం కొత్తగా ఉండటంతో అందరు మొదటి ఎపిసోడ్ నుండి ఆసక్తిగా చూద్దామనుకుంటారు. కానీ అసలు ఈ కాన్సెప్ట్ ని వదిలేసి పోలీస్ ఇన్వెస్టిగేషన్ వైపు, అటు లవ్ ట్రాక్ అంటు సాగదీస్తారు.
కాన్సెప్ట్ కొత్తగా ఉన్నప్పుడు దానిని బేస్ చేసుకొని కథని కొత్తగా అల్లుకుంటూ పోవచ్చు కానీ దర్శకుడు రిషి పాత్రకి అంత స్కోప్ ఇవ్వలేదు. పైగా అతనికున్న పవర్ ని తీసిపారేసేట్టుగా పోలీసులు చూస్తుంటారు. అది చూసి కామన్ ఆడియన్ కి ఏంట్రా బాబు ఈ పవర్స్ అనిపిస్తుంది. ఇక నవదీప్ పాత్రని ఎందుకు ఇంత డల్ గా రాసారో తెలియదు. క్యారెక్టర్ కు తగిన సీరియస్ నెస్ ని క్రియేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడు.
మంచి కాన్సెప్ట్ ని వదిలేసి క్యారెక్టర్ల మధ్య సోది మాటలు ఎక్కువగా చూపించారు. ఇక కొన్ని పాత్రలు ఎందుకున్నాయో అర్థం కాదు. ఈ సిరీస్ మొత్తంగా ఆరు ఎపిసోడ్ లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ ముప్పై నిమిషాలు ఉంటాయి. మొదటి ఎపిసోడ్, నాల్గోవ ఎపిసోడ్, చివరి ఎపిసోడ్ తప్ప మిగతా ఎపిసోడ్ లన్నీ డొల్లా.. అన్ ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్ తో నీరసం తెప్పించారు. రిషి, రాఘవ్ పాత్రలని ఇంకా స్ట్రాంగ్ గా రాసుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ ఒకే. ఎడిటింగ్ లో కొన్ని సీన్లని ట్రిమ్ చేస్తే బాగుండనిపిస్తుంది. మ్యూజిక్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
రాఘవ్ గా నవదీప్, రిషిగా దీక్షిత్ శెట్టి, మేఘగా కోమలి ప్రసాద్, దేవికగా సంచిత పూనాచా తమ పాత్రలకి న్యాయం చేశారు. మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : డోంట్ టచ్ మి నాట్ అనేలా ప్రెజెంటేషన్ ఉంది. జస్ట్ ఒకే.
రేటింగ్: 2 / 5
✍️. దాసరి మల్లేశ్
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
