గడిచిన 30 ఏళ్లలో టాలీవుడ్ రికార్డ్స్ -1
on Nov 4, 2017
అభిమానులు...మన హీరో.. పాత రికార్డులను తిరగరాశాడా? లేదా? అనే విషయాన్ని మాత్రం పర్టిక్యులర్ గా చూస్తారు. ఒకప్పుడు ‘సినిమా ఇన్ని రోజులు ఆడితే గొప్ప’ అనే సంస్కృతి ఉండేది. ఆ తర్వాత ‘ఇన్ని కేంద్రాలు ఆడితే గొప్ప’ అనే సంస్కృతి మొదలైంది. ఇప్పుడు ‘ఇన్ని డబ్బులొస్తే గొప్ప’ అనే సంస్కృతి నడుస్తోంది. మరి ఈ రకంగా చూసుకుంటే.. గడిచిన 30 ఏళ్లలో పాత రికార్డులను తిరగరాసిన మొనగాళ్లు ఎవరు? అనేది సీరియల్ వారీగా చెప్పుకుందాం. ముందు.. కేంద్రాల పరంగా ఎవరెవరు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారో చూద్దాం. అంటే.. ఎన్టీయార్ పాలిటిక్స్ లోకి వెళ్లినప్పట్నుంచి ఈ స్టోరీ మొదలవుతుందన్నమాట.
ఎన్టీయార్ పాలిటిక్స్ లోకి వెళ్లక ముందు.. సినిమా ఆడిన రోజులే విజయానికి ప్రామాణికం. అలా కాకుండా.. ‘ఇన్ని కేంద్రాల్లో ఆడితే గొప్ప’ అనే సంస్కృతి మొదలైంది మాత్రం బాలకృష్ణ ‘ముద్దుల మామయ్య’ నుంచే. ఈ సినిమా 28 కేంద్రాల్లో నాలుగు ఆటలతో వంద రోజులు ఆడి.. రికార్డు క్రియేట్ చేసింది. ఇక అక్కడ్నుంచి మొదలైంది.. యుద్ధం.
ఆ రికార్డును ఎవరు బద్దలు చేసుంటారో చెప్పుకోండి? ఇంకెవరు.. మెగాస్టార్ చిరంజీవి. ఆయన నటించిన ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’ సినిమా 29 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఆ రికార్డు కూడా ఎక్కువ రోజులు మనలేదు. రెండేళ్లు తిరగ్గ ముందే.. ‘గ్యాంగ్ లీడర్’ రూపంలో ఆ రికార్డును కూడా మట్టికరిపించేశాడు మెగాస్టార్. ‘గ్యాంగ్ లీడర్’ 30 కేంద్రాల్లో డైరెక్ట్ గా వందరోజులాడింది.
ఆ రికార్డును కూడా ఏడాది తిరక్కుండానే బద్దలు చేశాడు చిరంజీవి. ‘ఘరనా మొగుడు’ చిత్రం ఏకంగా 39 కేంద్రాల్లో వంద రోజులాడి.. సౌతిండియాలోనే నంబర్ వన్ మూవీగా నిలిచింది. అంతేకాదు.. సినిమా వసూళ్లు పది కోట్లకు చేరుకోవడం కూడా ‘ఘరానా మొగుడు’ నుంచే మొదలైంది.
‘ఘరానా మొగుడు’ రికార్డు బద్దలవ్వడానికి దాదాపు అయిదేళ్లు పట్టింది. అయితే.. ఆ రికార్డును కూడా తిరగరాసింది మెగాస్టారే. ‘హిట్లర్’ చిత్రం ఆ క్రెడిట్ దక్కించుకుంది. 42 కేంద్రాల్లో ‘హిట్లర్’ నాలుగాటలతో వంద రోజులాడింది.
అయితే... మెగాస్టార్ ప్రభంజనానికి బ్రేక్ వేసిన క్రెడిట్ మాత్రం విక్టరీ వెంకటేశ్ దే. మెగాస్టార్ రికార్డుల వేటలో తొలి ఎదురు దెబ్బ వెంకటేశ్ ద్వారా ఎదురైంది. వెంకీ నటించిన ‘ప్రేమించుకుందాం రా’ చిత్రం ఏకంగా 53 కే్ంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొని ఇండస్ట్రీ హిట్ గా నలిచింది.
అయితే... ఆ రికార్డుని కూడా మెగాస్టార్ అట్టే రోజులు బతకనీయలేదు. కొన్ని నెలల తేడా తోనే.. ‘బావగారూ బాగున్నారా?’తో ష్మాష్ చేసేశాడు. ‘బావగారూ బాగున్నారా?’ 54 కేంద్రాల్లో డైరెక్ట్ నాలుగు ఆటలతో వంద రోజులు ప్రదర్శితమై ‘మెగా స్టార్’ సత్తా ఏంటో తెలియజేసింది.
ఆ రికార్డును కూడా నెలల తేడాతోనే తిరగరాశాడు ‘మెగాస్టార్’. ఆ వెంటనే వచ్చిన ‘చూడాలని ఉంది’ 63 కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శితమై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
అయితే.. మెగాస్టార్ కెరీర్లో గడ్డుకాలం మొదలైంది ఇక్కడ్నుంచే. 1999 సంక్రాంతి బరిలో రెండు సినిమాలు పోటీపడ్డాయ్. అవే.. బాలయ్య ‘సమరసింహారెడ్డి’, మెగాస్టార్ ‘స్నేహం కోసం’. రెండు విజయాలను అందుకున్నాయ్. అయితే.. ‘సమరసింహారెడ్డి’ మాత్రం అప్రతిహత విజయాన్ని అందుకుంది. అప్పటివరకూ ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసి.. దేశం మొత్తం టాలీవుడ్ వంక తిరిగేలా చేసింది. 72 కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శితమై బాక్సాఫీస్ నివ్వెర పోయేలా చేసింది.
‘సమరసింహారెడ్డి’ విజయం సామాన్యమైంది కాదు. ఎందుకంటే.. దేశంలోనే అప్పటివరకూ అత్యధిక కేద్రాల్లో సిల్వర్ జూబ్లీ ఆడిన ఘనత ‘హమ్ ఆప్ కేహై కౌన్’ చిత్రానికే ఉంది. దేశం మొత్తం విడుదలైన ఆ బాలీవుడ్ క్లాసిక్.. ఏకంగా 29 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శితమైంది. ఆ రికార్డ్ ను ఒక ప్రాంతీయ చిత్రమైన ‘సమరసింహారెడ్డి’ బ్రేక్ చేసింది. ఏకంగా 31 కేంద్రాల్లో 175 రోజులు ఆడి.. తెలుగోడి సత్తా తెలియజేసింది. ఈ సినిమా నుంచే తెలుగు సినిమా పరిశ్రమలో ఫ్యాక్షన్ కథల సంస్కృతి మొదలైంది. ఈ సినిమా నుంచే అప్శపటివరకూ శదినోత్సవాలను రికార్డులుగా చెప్పుకున్న టాలీవుడ్ ఇండస్ట్రీ.. సిల్వర్ జూబ్లీలను మాత్రమే ఇండస్ట్రీ రికార్డులుగా చెప్పుకోవడం మొదలుపెట్టింది.
‘సమరసింహా రెడ్డి’ వంద రోజుల కేంద్రాల రికార్డు మాత్రం వెంటనే పగిలిపోయింది. ఆ క్రెడిట్ దక్కించుకుంది వెంకటేష్. ఆయన నటించిన ‘కలిసుందాం రా’ చిత్రం 78 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. కానీ.. ఇండస్ట్రీ హిట్ అనిపించుకోలేకపోయింది. కారణం..‘సమరసింహారెడ్డి’ సిల్వర్ జూబ్లీ రికార్డు పదిలంగా ఉండటమే.
ఆ తర్వాత వచ్చిన బాలకృష్ణ ‘నరసింహనాయుడు’ మళ్లీ ‘సమరసింహారెడ్డి’ స్థాయి విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమాతో తెలుగు సినిమా వంద రోజుల కేంద్రాల సంఖ్య వంద సెంటర్లు దాటింది. ఏకంగా. 105 కేంద్రాల్లో నాలుగు ఆటలతో డైరెక్ట్ గా వంద రోజులు ప్రదర్శితమైందీ సినిమా. వంద కేంద్రాల పైచిలుకు వంద రోజులు ఆడటం అనేది అప్పటి ప్రేక్షకులను నివ్వెర పోయేలా చేసింది.
‘చూడాలని ఉంది’ తర్వాత నుంచి మెగాస్టార్ కి ఆ స్థాయి విజయం లేకపోవడం మెగా అభిమానులను కలతకు లోను చేసింది. నాలుగేళ్లు చాలా భారంగా నడిచింది. అయితే ఆ నిరుత్సాహాన్ని పారద్రోలుతూ.. 2002లో విడుదలైంది ‘ఇంద్రా’. అప్పటివరకూ ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తిరగరాసింది. చివరకు ‘సమరసింహారెడ్డి ’ సిల్వర్ జూబ్లీ రికార్డును కూడా బద్దలు కొట్టి... ‘సమర సింహారెడ్డి’ తర్వాత మళ్లీ ఇండస్ట్రీ హిట్ నమోదు చేసింది.
ఇక అక్కడ్నుంచి.. తెలుగు సినిమా పొల్యూట్ అవ్వడం మొదలైంది. రికార్డుల కోసం నిర్మాలను ఇబ్బందులు పెట్టి మరీ కేంద్రాలు ఆడించుకునే కుసంస్కారం మొదలైంది. సో.. ’ఇంద్ర’ తర్వాత రికార్డుల గురించి మనం చెప్పుకోకపోవడమే కరెక్ట్.
నెక్ట్ష్ నుంచి వసూళ్లలో కింగ్ ఎవరో చూద్దాం.