రెండు నెలల్లో 11 స్క్రిప్ట్స్ రాశాడట!
on May 18, 2020
తమిళనాట దర్శకుడు మిస్కిన్ కి విలక్షణ చిత్రాలను తీస్తాడని పేరు ఉంది. తన తీసిన సినిమాల కారణంగా వార్తల్లో నిలిచే ఈ దర్శకుడు, కొన్ని రోజుల క్రితం హీరో విశాల్ తో వివాదం కారణంగా వార్తల్లో నిలిచాడు. ఒక లేఖ విడుదల చేయడం మినహా అప్పట్లో ఆయన మీడియా ముందుకు రాలేదు. రెండు నెలలుగా లాక్ డౌన్ లో ఉంటున్న ఆయన, మళ్లీ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు.
విశాల్ హీరోగా మిస్కిన్ దర్శకత్వం వహించిన తమిళ సినిమా 'తుప్పరివాలన్'. తెలుగులో 'డిటెక్టివ్'గా విడుదలైంది. రెండు భాషల్లోనూ సినిమా విజయం సాధించింది. దాంతో సీక్వెల్ స్టార్ట్ చేశారు. ఆ షూటింగ్ లో హీరో కి దర్శకుడికి మధ్య గొడవలు వచ్చాయి. సినిమా నుండి మిస్కిన్ తప్పుకున్నారు. ఈ లోపు కరోనా, లాక్ డౌన్ వచ్చాయి. ఈ రెండు నెలల కరోనా కాలంలో 11 స్క్రిప్ట్స్ డెవలప్ చేశానని మిస్కిన్ తెలిపారు. శింబు హీరోగా ఆయన ఒక సినిమా తెరకెక్కించనున్నాడని వార్తలు వచ్చాయి. వాటి పైన స్పందించారు. "నేను తీసిన ఒక్క సినిమా నచ్చిందని శింబు ఫోన్ చేసి చెప్పాడు. తర్వాత నా ఆఫీస్ కి వచ్చి మాట్లాడాడు. మీతో కలిసి పనిచేయాలని ఉందని చెప్పాడు. ఇటీవల మేం మరోసారి కలిశాం. శింబుకి నేను ఒక కథ చెప్పాను. అతడికి నచ్చింది. ప్రస్తుతం అతడికి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. అది పూర్తయిన తర్వాత మేం సినిమా చేస్తాం" అని మిస్కిన్ అన్నారు.