తమిళనాడులో టీవీ షూటింగులకు గ్రీన్ సిగ్నల్
on May 22, 2020
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మళ్లీ షూటింగులు ఎప్పుడు మొదలవుతాయో ప్రస్తుతానికి తెలియని పరిస్థితి. గురువారం తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో హీరోలు చిరంజీవి, నాగార్జున సహా అగ్ర దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, వి.వి.వినాయక్, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ సురేష్ బాబు, దిల్ రాజు, సి.కళ్యాణ్ శ్యాం ప్రసాద్ రెడ్డి, ఎస్.రాధాకృష్ణ, స్రవంతి రవి కిషోర్ తదితరులు సమావేశమయ్యారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ చేయాలనేది మాక్ షూట్ చేసి చూపిస్తామని ప్రతిపాదించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రివర్యులు... ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించడానికి అనుమతులు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి పక్కన పెడితే... పొరుగు రాష్ట్రాలలో టీవీ షూటింగులు మొదలు అవుతున్నాయి.
కర్ణాటకలో ఆల్రెడీ టీవీ షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా! తమిళనాడులో సైతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా గురువారం నాడు టీవీ సీరియల్స్ షో షూటింగ్ చేసుకోవడానికి తమిళ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత శుభ్రత వంటి జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేయనున్నారు. 20 కంటే ఎక్కువ మందిని చిత్రీకరణ ప్రదేశంలో అనుమతించకూడదని నిర్ణయించారు.