ఇయర్ రౌండప్: ఈ ఏడాది విజయాలను అందుకున్న ప్రయోగాలు!
on Nov 13, 2017
ఈ ఏడాది తెలుగు సినిమాకు మంచి విజయాలు దక్కిన మాట నిజమే కానీ.. అంతకంటే ఆనందించాల్సిన విషయం ఒకటుంది. అదేంటంటే.. ఈ ఏడాది తెలుగు సినిమా ప్రయోగాల బాట పట్టి సక్సెస్ అవ్వడం. కొన్నేళ్లుగా మన దర్శకులు కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే.. అది బెడిసికొడుతూ వచ్చింది. కానీ.. ఈ ఏడాది కొత్తగా ట్రై చేస్తే చాలు.. విజయం వరించింది. అలా ఈ ఏడాది.. ట్రెండ్ కి భిన్నంగా తయారై విజయాన్నందుకున్న సినిమాల గురించి కాసేపు చెప్పుకుందాం.
చాలా విరామం తర్వాత తెలుగు తెరను పలకరించిన చారిత్రాత్మక చిత్రమిది. నిజానికి శాతకర్ణి కథ పూర్తిస్థాయిలో అందుబాటులో లేదు. రెండు వేల సంవత్సరాల క్రితం కథ అవ్వడంతో ‘శాతకర్ణి కథ ఇది’ అని మేధావులు సైతం చెప్పలేని పరిస్థితి. కానీ.. ఆయన గొప్పతనం మాత్రం పూర్వీకుల నుంచి ఒకట్రెండు విషయాల ద్వారా తేటతెల్లం అవుతూనే ఉంది. అలాంటి కథను ఎంచుకొని.. దానిపై రీసెర్చ్ చేసి క్రిష్ తయారు చేసిన కథ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. బాలకృష్ణ 100వ చిత్రంగా విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకోవడమే కాక, విమర్శకుల ప్రశంసలందుకుంది. బాలయ్య అద్వితీయమైన నటనావైదుష్యం, క్రిష్ దర్శకత్వ ప్రతిభ, సాయిమాధవ్ బుర్రా సంభాషణాచాతుర్యం సినిమాను ఓ గొప్ప స్థాయిలో నిలబెట్టాయ్. వాణిజ్యపరంగా కూడా ఈ సినిమా విజయాన్ని అందుకోవడం విశేషం.
సంక్రాంతి సీజన్లో విడుదలైన అసలుసిసలైన సంక్రాంతి సినిమా ఇది. కార్పొరేట్ సంస్కృతి సినిమా కథలను కూడా ఆవహించిన నేటి తరుణంలో... తెలుగు సంస్కృతినీ, సంప్రదాయాలను మేళవించి దర్శకుడు వేగేశ్న సతీశ్ తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి టాప్ స్టార్ల సినిమాలతో పాటు విడుదలై వాటికి ఏ మాత్రం తగ్గని స్థాయిలో విజయ దుందుభి మోగించింది. శర్వానంద్ కెరీర్లో పెద్ద హిట్ గా నిలిచింది. నిర్మాత దిల్ రాజుకు మళ్లీ పూర్వ వైభవాన్ని కట్టబెట్టింది. మన పల్లె జీవితాలు, కుటుంబ విలువలు, ప్రేమ నేపథ్యంలో సాగే సినిమా ఇది.
సముద్ర గర్భంలో రెండు దేశాలు కొట్టుకోవడం తెలుగు సినిమా ఇప్పటివరకూ చూడలేదు. ‘ఘాజీ’ ద్వారా దాన్ని కళ్లకు కట్టాడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. నిజానికి ఈ కథను తను ఓ నవలగా రాశాడు. అనుకోకుండా దాన్నే సినిమాగా తీయాల్సొచ్చింది. ఇది యాదృశ్చికం. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య కాంక్షతో.. పాక్ తో యుద్ధానికి ‘సై’ అనడం.. బంగ్లాకు భారత్ మద్దతు పలకడం.. తద్వారా సంభవించిన పరిణామం.. ఈ సినిమా నేపథ్యం. 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధానికి ఈ కథే నాంది. ఇలాంటి ప్యాట్రియాటిక్ ఫిలింస్ తెలుగుతెరపై రావడం అరుదు. అలా అరుదైన సినిమా ‘ఘాజీ’. నేవీ సైనికుల జీవన విధానం ఎలా ఉంటుంది? సముద్ర గర్భంలో వారి స్థితిగతులు ఎలా ఉంటాయ్? ఇలాంటి ఎన్నో అంశాలను ఇందులో చర్చించారు. ఓ విధంగా ఈ సినిమా ఓ ఎడ్యుకేషన్. వాణిజ్యపరంగా కూడా ఈ సినిమా విజయాన్ని అందుకోవడం విశేషం.
క్రీడా నేపథ్యంలో సాగే హృద్యమైన కథ ఇది. బాలీవుడ్ లో వచ్చిన పలు క్రీడా నేపథ్య చిత్రాల దారిలో ప్రయాణించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. వెంకటేశ్ ఇందులో తన ఇమేజ్ కి పూర్తి భిన్నమైన పాత్ర పోషించి మెప్పించాడు. ఓ వైపు క్రీడా స్పూర్తిని రగిలిస్తూ.. మరో వైపు భావోద్వేగాల మేళవిస్తూ.. దర్శకురాలు సుధా కొంగర ఈ చిత్రాన్ని మలచారు. తెలుగు సినిమాకు ‘గురు’ కచ్చితంగా కొత్త సినిమా. అందులో నో డౌట్.
తెలుగు నేలపైనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సినిమా ఇది. ఒక ప్రాంతీయ భాషా చిత్రానికి 1750 కోట్ల వసూళ్లు రావడం అనేది ఓ చరిత్ర. అందుకే... తెలుగు సినిమా ఉన్నంతవరకూ ‘బాహుబలి’కి స్థానం ఉంటుంది. మాయాబజార్, నర్తనశాల, శంకరాభరణం లాంటి క్లాసిక్ ల చెంత చేరే స్థాయి దక్కించుకుంది. ఇదొక విజువల్ వండర్. ఓ దర్శకుని మాయాజాలం. భారతీయ తెరపై భారతీయ భాషల్లో.. భారతీయ సంప్రదాయంతో.. భారతీయ నటులతో.. భారతీయ సాంకేతిక నిపుణులతో రూపొందిన హాలీవుడ్ స్థాయి సినిమా ‘బాహుబలి ది కంక్లూషన్’. ఈ ఏడాదే ఈ అద్భుతం జరగడం విశేషం.
విడుదలకు ముందు అస్సలు అంచనాలే లేని ఈ సినిమా విడుదలయ్యాక.. సంచలనానికి కేంద్రబిందువయ్యింది. శేఖర్ కమ్ముల అంతకు ముందెన్నడూ టచ్ చేయని నేపథ్యాన్ని ఎంచుకొని.. ఓ సంస్కృతిని తెరపై ఆవిష్కృతం చేస్తూ.. తెలుగువారందరినీ ‘ఫిదా’ చేసేశాడు. ఈ సినిమా కేవలం ప్రేమకథ మాత్రమే కాదు. తెలంగాణ సంస్కృతికి చిహ్నం. తెలంగాణ అందానికి అద్దం. మేధావుల ప్రశంసలే కాక వాణిజ్య పరంగా కూడా నిర్మాతకు కాసుల వర్షం కురిపించిందీ సినిమా.
రాజశేఖర్ కి పూర్వవైభవం ప్రసాదించిన ఈ చిత్రం నిజంగా మంచి ప్రయత్నం. ఈ ఏడాది వచ్చిన మంచి సినిమాల్లో ‘గరుడ వేగ’ కూడా ఒకటి. పోలీస్ సీక్రెట్ ఏజెంట్ల కుటుంబ వ్యవహారాలు ఎలా ఉంటాయ్? తాము చేస్తున్న ఉద్యోగం ఏంటో బయటకు చెప్పుకోలేని పరిస్థితి. మరి అలాంటప్పుడు ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తారు? దేశాన్ని సైతం కుదిపేసే.. భారీ కుంభకోణాలు అసలు ఎలా జరుగుతాయ్? వాటిని బడా నేతలు ఎలా నడిపిస్తారు? ఇంటర్ననల్ గా జరిగే వ్యవహారాలేంటి? ఇవన్నీ కళ్లకు కట్టిన సినిమా ఇది. రాజశేఖర్ మళ్లీ నట విశ్వరూపమే చూపించాడనాలి.
ఈ ఏడాది వచ్చిన మంచి సినిమాలు ఇవన్నమాట. వచ్చేవారం.. ఈ ఏడాది వాణిజ్యపరంగా దుమ్ము రేపిన సినిమాల లిస్ట్ ని వచ్చేవారం చెప్పుకుందాం.