ఆ సినిమా... మోహన్ బాబు-రాజశేఖర్ చేయాల్సిందట!
on Nov 13, 2017
మోహన్ బాబు, రాజశేఖర్ కాంబినేషన్ లో సినిమా... ఊహకందని కాంబినేషన్ కదా ఇది. త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోందనుకుంటున్నారా? అయితే.. మీరు పప్పులో కాలేసినట్టే. విషయం ఏంటంటే.. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా సన్నాహాలు జరిగాయ్. ఇద్దరికీ అడ్వాన్సులు కూడా ఇచ్చేశారు. అయితే... వీరిద్దరి మధ్య చిన్న అభిప్రాయబేధాలు తలెత్తడంతో సినిమా ఆగిపోయింది. వివరాల్లోకెళ్తే..‘హనుమాన్ జంక్షన్’... సినిమా గుర్తుందా? అదేనండీ... అర్జున్, జగపతిబాబు హీరోలుగా నటించిన సినిమా. వాణిజ్య పరంగా మంచి విజయం సాధించిన సినిమా అది.. ఈ సినిమానే ముందు మోహన్ బాబు, రాజశేఖర్‌లతో చేయాలనుకున్నాడట నిర్మాత ఎడిటర్ మోహన్. ఇద్దరికీ అడ్వాన్సులు కూడా ఇచ్చేశారు. ఇక త్వరలో సెట్స్ కి వెళుతుందనగా.. మోహన్ బాబు, రాజశేఖర్ ఓ సందర్భంలో కలవడం జరిగింది. ఆప్పుడు వారిద్దరూ పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్న సందర్భంలో ‘టైమింగ్’ టాపిక్ వచ్చింది. ‘నేను షూటింగ్ కి అరగంట ముందే వచ్చేస్తాను. ఈ సమయపాలన అనేది అన్నగారి నుంచి నాకు సంక్రమించింది. అంతేకాదు.. నా తోటి నటులు కూడా షూటింగ్ కి టైమ్ కి రావాలని కోరుకుంటాను. నువ్వు షూటింగులకు ఆలస్యంగా వస్తావనే పేరుంది.
సో.. మనం కలిసి చేస్తున్న సినిమా విషయంలో మత్రం తప్పకుండా టైమ్ కి లొకేషన్లో ఉండాలి’ అన్నారట మోహన్ బాబు తనదైన శైలిలో. దానికి రాజశేఖర్ అదే స్థాయిలో స్పందించాడట. ’చూడండీ.. అది నాకు సంబంధించిన విషయం. ఇలాంటి విషయాల్లో నన్ను ఇబ్బంది పెడితే.. నేను సినిమా చేయలేను’ అని సూటిగా చెప్పేశాడట. దాంతో మోహన్ బాబు... ’మనం కలిసి పనిచేయలేం. సో... ఈ సినిమా నుంచి తప్పుకోవడమే కరెక్ట్’ అనేశారట. ఆ విధంగా ఇద్దరూ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత వారి స్థానంలో అర్జున్, జగపతిబాబు వచ్చి చేరారు. గింజగింజ పై తినేవాళ్ల పేర్లు రాసుంటాయని ఊరకే అన్నారా?