బాహుబలిని చూసి వాతలు పెట్టుకొంటున్న శ్రీమంతుడు
on Aug 1, 2015
బాహుబలి పుష్కరానికి ఒకసారి వచ్చే సినిమా. ఈ విషయం రాజమౌళి కూడా ఒప్పుకొంటాడు. దాని స్పాన్, మార్కెట్ వేరు. ఈ సినిమాకి మీడియా వద్దంటే పబ్లిసిటీ ఇచ్చింది. పైసా ఖర్చు పెట్టకపోయినా కోట్లాది రూపాయల విలువ గల ప్రచారం చేసి పెట్టింది. ప్రతి రోజూ.... బాహుబలి వార్తలే పతాక శీర్షికల్లో సాగేవి. `మాకూ అలానే పబ్లిసిటీ చేసిపెట్టకూడదూ...` అంటూ శ్రీమంతుడు టీమ్ కూడా ఇప్పుడు మీడియాను కోరుతోందట. బాహుబలి అంత కాకపోయినా.. మాకూ ఆ రేంజులోనే పబ్లిసిటీ కావాలని అంటున్నారట. అంతేకాదు, రోజుకో స్టిల్లు విడుదలచేసి, ఇంటర్వ్యూలు పెట్టి హంగామా సృష్టిస్తున్నారు.
ఇప్పుడు బెనిఫిట్ షోలలో కూడా బాహుబలి ఫార్ములానే అనుసరిస్తున్నారని టాక్. శ్రీమంతుడు ఆగస్టు 7న విడుదల కాబోతోంది. అప్పుడే ఈ సినిమా కోసం బెనిఫిట్ షోల హంగామా మొదలెట్టేశారు. ఎక్కడెక్కడ షోలు ప్రదర్శించాలి, టికెట్లు రేటు ఎంతుండాలి? అనే విషయాలపై నిర్మాతలు అప్పుడే ఓ అభిప్రాయానికి వచ్చేశారు. టికెట్లు రేటు 1500 నుంచి 2500 వరకూ ఉంది. డిమాండ్‌ని బట్టి రేటు ఫిక్సవుతుందన్నమాట. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలలోని కొన్ని ప్రధానమైన ప్రాంతాల్లో ఈ షోలు ఏర్పాటు చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఓవర్సీస్ లో మహేష్‌కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అందుకే అక్కడ ఆగస్టు 6నే షోలు వేయాలని చిత్రబృందం నిర్ణయం తీసుకొంది. అంతా బాగానే ఉంది. మరి బెనిఫిట్ షోల వల్ల వచ్చే బెనిఫిట్ ఏమిటి? సినిమా బాగుంటే ఫర్వాలేదు. లేదంటే టాక్ ముందే బటయకు వచ్చి, ఓపెనింగ్స్‌పై దారుణమైన ప్రభావాన్ని చూపించడం ఖాయం. మహేష్ కూడా భయపడుతోంది దాని గురించే. బెనిఫిట్ షోలపై అంత దృష్టి పెట్టొద్దు.. లైట్ తీసుకోండి.. అని మహేష్ తన నిర్మాతలకు సూచించాడట. కానీ.. వాళ్లు మాత్రం వినేట్టు లేరు. బాహుబలి బెనిఫిట్ షోల వల్ల భారీ ఆదాయం వచ్చింది, మాకూ అంత వస్తుంది కదా అని లెక్కలు వేస్తున్నారట.
బాహుబలికి వచ్చిన హైప్ వేరు. ఆ సినిమాని చూడాలని ప్రేక్షకులు రెండేళ్ల నుంచీ ఎదరుచూశారు. అందుకే వాళ్లంతా బెనిఫిట్ షోలకు ఎగబడ్డారు.అందుకే బెనిఫిట్ షో రేటు ఎంతున్నా కొనేశారు. అలాగని శ్రీమంతుడుకీ అదే రిజల్ట్ వస్తుందని అనుకొంటే ఎలా..? పులిని చూసి నక్క వాతపెట్టుకొన్నట్టు ఉండదూ..??