చరణ్-శంకర్ మూవీ.. కొత్త శ్రీకాంత్ ని చూస్తారు!
on Jan 24, 2022

ఇటీవల 'అఖండ' సినిమాలో వరదరాజులు పాత్రలో నటించి మెప్పించిన శ్రీకాంత్ త్వరలో ఓ విభిన్న పాత్రతో పలకరించబోతున్నారు. రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, ఈ పాత్రలో తనని చూసి అందరూ షాక్ అవుతారని శ్రీకాంత్ అంటున్నారు.
తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "సరైనోడు సినిమా సమయంలోనే బోయపాటి శ్రీను నన్ను విలన్ పాత్రలో నటిస్తారా అని అడిగారు. 'యుద్ధం శరణం' సినిమాలో విలన్ గా చేశాను. అది మంచి సినిమా.. కానీ హిట్ కాలేదు. ఆ తర్వాత విలన్ పాత్రలు వచ్చినా నేను చేయలేదు. ఇక బోయపాటి అఖండ కథ చెప్పి, వరదరాజులు పాత్ర గురించి చెప్పారు. ఈ పాత్రతో కచ్చితంగా నాకు గుర్తింపు వస్తుందని అనుకున్నాను. వరదరాజులు క్యారెక్టర్.. నేను విలన్‌గా చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ ని ఇచ్చింది" అని చెప్పుకొచ్చారు శ్రీకాంత్.
ఇక రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గురించి మాట్లాడుతూ.. "ఈ సినిమాలో నా పాత్రను చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. సినిమా చూసిన వారంతా ఇతను శ్రీకాంతేనా? అని అనుకుంటారు. తెరపై కొత్త శ్రీకాంత్ ని చూస్తారు" అన్నారు శ్రీకాంత్. మరి ఈ పాన్ ఇండియా మూవీలో పవర్ ఫుల్ రోల్ తో శ్రీకాంత్ ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



