పవన్ స్పర్శకు అంత శక్తి ఉందా??
on Dec 1, 2014
పవన్ కల్యాణ్... అభిమానులకు దేవుడు! కోట్లాది మంది ఫ్యాన్స్‌కి పవన్ నామమే ఓ మంత్రం! వాళ్లందరికీ పవన్ కోసం ప్రాణాలను ఇచ్చేసేంత అభిమానం ఉంది. ప్రతి గుండెలోనూ పవన్ కోసం ఓ గుడి ఉంది. అయితే పవన్ మాటకూ, పవన్ చేతకూ, పవన్ స్పర్శకూ కూడా శక్తి ఉందని పవన్ పై అభిమానం ప్రాణాల్నీ కాపాడుతుందని శ్రీజ ఉదంతం రుజువు చేస్తోంది. పవన్ ఇచ్చిన మానసిక స్థైర్యం.. పవన్ పలకరింపు, పవన్ మాటా.. శ్రీజకు ఇప్పుడు సంజీవనీ మంత్రమైపోయింది ఖమ్మంకి చెందిన బాలిక శ్రీజ తీవ్ర అనారోగ్యం బారిన పడి చికిత్స పొందుతూ పవన్ పేరు పలవరించింది. డాక్టర్లు కూడా ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు.. మేక్ ఏ విష్ సంస్థ ద్వారా విషయాలు తెలుసుకొన్న పవన్ శ్రీజను చూడ్డానికి ప్రత్యేకంగా వెళ్లాడు. శ్రీజని పలకరించాడు, మాట్లాడాడు, కొన్ని బహుమతులూ ఇచ్చి, ఆర్థికంగా సహాయం చేసి మరీ వచ్చాడు. ఆతరవాత పవన్ మాయ ప్రారంభమైంది. డాక్టర్లు కూడా చేతులెత్తేసిన శ్రీజ కేసులో అనూహ్యమైన మార్పులు సంభవించాయి. శ్రీజ మెల్లమెల్లగా కోలుకోవడం ప్రారంభించింది. తన పనులు తాను చేసుకోవడం మొదలెట్టింది. దాదాపుగా కోమా స్థితిలోకి వెళ్లిన శ్రీజ... ఇప్పుడు అందరినీ గుర్తు పడుతోంది. మాట్లాడుతోంది... ఇప్పుడు తన 13వ పుట్టిన రోజు కూడా అదే ఆసుపత్రిలో చేసుకొంది. శ్రీజ ఇలా కోలుకోవడం డాక్టర్లను కూడా విస్మయానికి గురిచేస్తోంది. శ్రీజ విషయంలో తాము తీసుకొన్న శ్రద్ధ ఒక ఎత్తయితే, పవన్ రావడం, ఆమెను పరామర్శించడం మరో ఎత్తని, మానసికంగా శ్రీజలో పవన్ చైతన్యం నింపాడని డాక్టర్లు సైతం చెబుతున్నారు. శ్రీజ ఇప్పుడు మాట్లాడుతోంది.. అయితే ప్రతి మాటా పవన్ గురించే `ఐ లవ్ యూ.. పవన్` అంటూ ఆ చిన్నారి పెదవులు పవన్ నామ స్మరణ చేస్తున్నాయి. శ్రీజ తల్లితండ్రులైతే పవన్‌ని ఇప్పుడు దేవుడిలా కొలుస్తున్నారు. పవన్ రాకతోనే మా అమ్మాయి బతికింది అని చేతులెత్తి మొక్కుతున్నారు. నిజంగా.. ఇది అపూర్వం.. అద్భుతం. పవన్ దేవుడు కాకపోవచ్చు, అతని చేతిలో సంజీవనీ లేకపోవచ్చు. కానీ మనస్ఫూర్తిగా ఓ బాలిక కోలుకోవాలని ఆకాంక్షించాడు. మనసులోనే ప్రార్థించాడు. ఆ ఆకాంక్షలు, ప్రార్థనలు ఫలించాయి. శ్రీజ కోలుకొంది.. హ్యాట్సాప్ పవన్ కల్యాణ్!!