రాఘవేంద్ర రావుకి, మోహన్ బాబుకి ఆ లోటు పూడ్చలేనిది
on Feb 26, 2018
మనం ఎన్నో అనుకుంటాం... కానీ అందులో కొన్నే జరుగుతుంటాయి... కొన్ని తీరని కోరికలుగా మిగిలిపోతుంటాయి. అలా, దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు కి కూడా శ్రీదేవి మరణంతో ఒక తీరని కోరిక మిగిలి ఉండిపోయింది. బాలనటిగా 100 మార్కులు సంపాదించుకున్న శ్రీదేవికి పదహారేళ్ళ వయసు సినిమాతో హీరోయిన్ గా మొదటి బ్రేక్ ఇచ్చింది రాఘవేంద్ర రావు గారు అన్న విషయం మనకు తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఇద్దరు కలిసి మరో 23 , అంటే మొత్తంగా 24 సినిమాలకి కలిసి పని చేశారు. అందులో హిట్ల సంఖ్య ఎక్కువే. బాలీవుడ్ లో హిమ్మత్ వాలా తో ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది కూడా దర్శకేందుడే. అలాంటి పెద్దాయనకి శ్రీదేవి మరణంతో ఆమెతో 25 వ సినిమా చేయాలనే కోరిక అలా మిగిలి ఉండి పోయింది.
శ్రీదేవి కంబ్యాక్ ఫిలిం మామ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న రాఘవేంద్ర రావు ఆమెతో ఇంకో సినిమా చేయాలనే కోరిక వెలిబుచ్చారు. అందుకు శ్రీదేవి మీతో పనిచేయడం కన్నా మహర్భాగ్యమా అని సమాధానం ఇచ్చారు. మోహన్ బాబు డ్రీం ప్రాజెక్ట్ రావణ లో శ్రీదేవి కి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఇవ్వాలనుకున్నారట దర్శకేంద్రుడు. శ్రీదేవి కెరీర్ లో మైలురాయిగా మిగిలేలా ఆ క్యారెక్టర్ ని రాసుకున్నాడట. ఇంతలోనే ఇలా జరగడంతో రాఘవేంద్ర రావు గారి కోరిక అలా మిగిలిపోయింది. ఒకవేళ రావణ తెరకెక్కిస్తే… అందులో శ్రీదేవి లేకుండా పోయిందే అనే లోటు మాత్రం ఇటు రాఘవేంద్రుడికీ, అటు మోహన్ బాబు కి వెంటాడుతూనే ఉంటుంది.