సన్నాఫ్ సత్యమూర్తి రివ్యూ
on Apr 9, 2015
పండగంటే మురిసిపోతాం.. ఎంత సందడో.
కొత్తబట్టలు, పాయాసం, గార్లూ, బూర్లూ, బొబ్బట్లు, పులిహోర, చుట్టాలూ ఓహ్... సూపర్!
కానీ పండగపూట చిరిగిపోయిన బట్టలు, పంచదార లేని పాయాసం, పూర్ణం లేని బూరెలు, మాడిపోయిన బొబ్బట్టు పెడితే.. ఇష్టం లేని చుట్టూలొస్తే.. అది పండగ కాదు దండగ.
మనకు త్రివిక్రమ్ సినిమా కూడా పండగ లాంటిదే.
పంచ్‌ల పాయాసాలూ, జోకుల జిలేబీలూ బోలెడుంటాయి. మనసుని హత్తుకొనే సన్నివేశాలతో, ఎమోషనల్ టచ్‌తో కడుపునిండా పండగ భోజనం పెట్టి పంపిస్తాడు.
అయితే ఆ పంచ్‌లో త్రివిక్రమ్ మార్క్ లేకపోతే...
ఆ ఎమోషన్స్ సాదీ సీదాగా సాగదీస్తే...
మనసుని హత్తుకోవడం మానేసి.. ఎందుకొచ్చిన గొడవరా బాబూ అంటూ నొచ్చుకొనేలా చేస్తే..??
ఆ సినిమానే సన్నాఫ్ సత్యమూర్తి.
సత్యమూర్తి (ప్రకాష్‌రాజ్) తనయుడు విరాజ్ ఆనంద్ (అల్లు అర్జున్). సత్యమూర్తికి ఆస్తుల కంటే విలువలే ముఖ్యం. అడిగినవాడికి కాదనకుండా సాయం చేస్తుంటాడు. విరాజ్ నిశ్చితార్థం పల్లవి(అదా శర్మ) తో జరుగుతుంది. సడన్ గా సత్యమూర్తి రోడ్డు ప్రమాదం లో మరణిస్తాడు. ఒక్కసారిగా నందూ కళ్ల ముందు చీకటి. ఆస్తులు కరిగి అప్పులు మిగులుతాయి. అప్పుల్ని తీర్చడానికి ఉన్న రూ.300 కోట్ల ఆస్తి వదులుకొంటాడు. పల్లవితో పెళ్లి ఆగిపోతుంది. అదే పల్లవి పెళ్లికి ఈవెంట్ మేనేజర్‌గా వెళ్లాడు విరాజ్. అక్కడ సమీర(సమంత) పరిచయం అవుతుంది. ఆమె ఎవరో కాదు.. సాంబశివరావు(రాజేంద్ర ప్రసాద్) కూతురు. ఆయన డబ్బు మనిషి. సత్యమూర్తికి ఫ్రెండు కూడా. లిటికేషన్ లో ఉన్న స్థలాన్ని మీ నాన్న నాకు అమ్మాడు... నన్ను మోసం చేశాడంటూ.. విరాజ్‌ని నిందిస్తాడు. ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు దేవరాజ్ (ఉపేంద్ర) దగ్గర ఉంటుంటాయి. వాటిని ఎలాగైనా తీసుకొస్తానని సాంబశివరావు దగ్గర పందెం కాస్తాడు విరాజ్ ఆనంద్. నాన్న పరువు నిలబెట్టడానికి దేవరాజ్ నాయుడు కోటలో కి అడుగుపెడతాడు. అక్కడ విరాజ్ ఆనంద్‌కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ తరవాత ఏం జరిగింది అనేదే సన్నాఫ్ సత్యమూర్తి కథ.
నాన్న అనే పాయింట్ పూర్తిగా పక్కన పెట్టి చూస్తే.. ఇదో ఆర్డనరీ కథ. ఇలాంటి కథలు, సినిమాలూ చాలా వచ్చాయి. ఈ తరహా సన్నివేశాలూ చూశాం. కానీ త్రివిక్రమ్ `నాన్న పరువు కోసం` అనే ట్యాగ్‌లైన్ తగిలించాడు. విలువల కోసం ఆస్తుల్ని వదులుకోవడం అనే క్యారెక్టర్‌ని హీరోలో ఇంజెక్ట్ చేశాడు. అందుకే ఈ సినిమా కాస్త కొత్తగుంటుంది. అలాగని త్రివిక్రమ్ సినిమాలా మాత్రం ఉండదు. త్రివిక్రమ్ సినిమా అంటే పడీ పడీ నవ్వుకొనే సన్నివేశాలు, గుర్తు తెచ్చుకొని మరీ చెప్పుకొనే డైలాగులూ, కంట తడి పెట్టించే సన్నివేశాలూ. అవి ఈ సినిమాలోనూ ఉన్నాయి. కానీ.. ఆ పంచ్లో ఇది వరకు స్పీడు లేదు. ఆ డైలాగుల్లో డెప్త్ లేదు. ఆ కన్నీటిలో ఆర్థ్రత లేదు. ఏదో అన్నీ ఉన్నట్టే ఉంటాయి.. చివరికి ఏదీ సంతృప్తినివ్వదు.
రచయితగా త్రివిక్రమ్ ఎప్పుడూ గెలుస్తూనే వచ్చాడు. రచయిత - దర్శకుడు పరుగు పందెంలో రచయిత నెం.1 అయ్యాడు. ఈసారి మాత్రం... రైటరు లాస్ట్. అలాగని డెరెక్టర్ బెస్ట్ అనుకోవద్దు. ఈ రెండు విభాగాల్లోనూ మొదటి సారి.. త్రివిక్రమ్ తడబడ్డాడేమో అనిపించింది. మొదటి నాలుగైదు సన్నివేశాలు చూస్తే.. ఓ ఫీల్ గుడ్, ఎమోషన్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అక్కడ నుంచి కొంచెం కొంచె సినిమా డ్రాప్ అవుతుంది. ఈవెంట్ మేనేజర్‌గా చూపించిన సీన్స్‌లో.. కామెడీ పండించొచ్చు. త్రివిక్రమ్ శైలి కూడా అక్కడ వాడుకోవచ్చు. కానీ దాన్ని వృద్దా చేశాడు. అక్కడి నుంచి సినిమాని ఇంట్రవెల్ వరకూ లాగడానికి అపసోపాలూ పడ్డాడు. ఇక సెకండాఫ్ లో ఉపేంద్ర ఎంట్రీ ఇచ్చాడు. ఆయన్ని ఈ సినిమాలో విలన్ అనుకోవాలో, ఓ ప్రధాన పాత్ర అనుకోవాలో అర్థం కాలేదు. విలన్ గా ఆయన్ని ప్రజెంట్ చేయడానికి త్రివిక్రమ్ ఎందుకో మొహమాటపడ్డాడు. ఆయన ఇంట్లో గారడీ చేసి.. బ్రహ్మానందాన్ని బకరాగా మార్చి - చూస్తోంది త్రివిక్రమ్ సినిమానా? శ్రీనువైట్ల సినిమానా? అనిపించేలా చేశాడు త్రివిక్రమ్. అయితే చివర్లో నాన్న తాలుకూ ఫ్లాష్‌బ్యాక్‌తో కథని ముగించడం బాగుంది. అంటే ఈ సినిమా తొలి పది నిమిషాలూ, చివరి ఎపిసోడ్ తప్ప... నాన్నకు సంబంధించిన ఆత్మ ఈ సినిమాలో ఎక్కడా కనిపించదు.
సత్యమూర్తి ఎంత గొప్పోడు? వాడి విలువలేంటి? అనే విషయాన్ని ఒకే ఒక్క డైలాగ్ లో సాగదీయకుండా చెప్పిన త్రివిక్రమ్ సినిమా అంతా ఇంతలా ఎందుకుసాగదీశాడో మాత్రం అర్థం కాదు. కథంతా ఒకే చోట గింగిరాలు కొడుతూ ఉంటుంది. కొత్త పాత్రలు వస్తుంటాయి. పాతవి కనుమరుగైపోతుంటాయి. దాంతో... కథ ఎక్కడో మొదలై ఎక్కడికో వెళ్లిపోయిన ఫీలింగ్ వస్తుంది.
బన్నీ ఎప్పట్లానే బాగా చేశాడు. తన స్టైల్స్ బాగున్నాయి. డ్రస్సింగ్ సెన్స్ ఆకట్టుకొంటుంది. ఎమోషనల్ సీన్స్ లో ఓ కొత్త బన్నీ కనిపిస్తాడు. స్టెప్పుల విషయంలో మాత్రం నిరాశ పరిచాడు. బన్నీ నుంచి కొత్త స్టెప్పులు చూడొచ్చనుకొన్న ఆయన అభిమానులు నిరుత్సాహపడడం ఖాయం. సమంత క్యారెక్టర్ శుద్ద దండగ. ఆమె గ్లామర్ ఎక్కడికి వెళ్లిపోయిందో..?? నిత్యమేనన్ చేసిన సినిమాల్లో మర్చిపోదగిన పాత్ర ఇది. ఉపేంద్ర చెల్లాయిగా నటించింది. ఉపేంద్ర ఇంట్లో ధాన్యపు బస్తాల మూటలు బాగా చూపించారు. అందులో ఓ బస్తాలా కనిపించింది.. నిత్య. కాకపోతే ఈ బస్తా.. నడుస్తుంది, మాట్లాడుతుంది అంతే తేడా. స్నేహని పిలిపించి, ఈ క్యారెక్టర్ ఆమెతోనే చేయించదగిన స్పెషాలిటీ ఏం లేదు ఆ పాత్రలో. ఉపేంద్రని ఇంకాస్త పవర్‌ఫుల్‌గా చూపించాల్సింది. అలీ, బ్రహ్మానందం యధావిధిగా నవ్వించడానికి విశ్వప్రయత్నం చేశారు. ఆదా శర్మ రోల్ కూడా చిన్నదే.
త్రివిక్రమ్ సినిమా అంటే డైలాగులు ఆశిస్తారు. ఆ విషయంలో లోటు చేయకుండా పేజీల కొద్దీ డైలాగులు రాసినా.. అందులో రిజిస్టర్ చేసుకోదగినవి కొన్ని మాత్రమే. సినిమా రిచ్‌గా ఉంది. నిర్మాత బాగా ఖర్చు పెట్టారన్న విషయం అర్థమవుతోంది. ఆర్ట్ విభాగం పనితనం కనబడింది. దేవిశ్రీ సంగీతంలో సూపరు మిచ్చీ పాట బాగున్నా.. దాన్ని వాడుకొన్న తీరు బాలేదు. అంతా గందరగోళంలా ఉందా పాట. కథకుడిగా, దర్శకుడిగా త్రివిక్రమ్‌కి ఇది మొదటి ఫెయిల్యూర్. దేవుడి దయవల్ల ఇదే చివరిదీ కావాలని కోరుకొందాం..
వేసవి సెలవలు, పరీక్షలు అయిపోయాయి. పైగా త్రివిక్రమ్ సినిమా అంటే హైప్ ఎక్కువ. అందువల్ల తొలి నాలుగు రోజులూ దుమ్ముదులిపే వసూళ్లు చూసి ఇది హిట్ సినిమా అని పొరపాటు పడొద్దు. అంకెలు వేరు, కనిపించే బొమ్మ వేరు అని అర్థం చేసుకోండి చాలు..
రేటింగ్ 2.5