సైజ్ జీరో రివ్యూ
on Nov 27, 2015
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలు మనక్కొంచెం తక్కువే. ఆ తరహా సినిమాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అయితే కేవలం కాన్సెప్ట్‌ని పట్టుకొని రెండు గంటలు పాటు ప్రేక్షకుడ్ని థియేటర్లో కూర్చోబెట్టడం కష్టం. ఆ కాన్సెప్ట్ చుట్టూ.. వినోదం, భావోద్వేగాలూ, సంగీతం, క్యారెక్టరైజేషన్లూ ఉండాలి. అప్పుడే ఆ కాన్సెప్ట్‌కి బలం వస్తుంది. సైజ్ జీరో అంటూ.... ప్రకాష్ కోవెలమూడి ఓ కాన్సెప్ట్ ట్రై చేశాడు. లావుగా ఉండే అమ్మాయిలు అత్మనూన్యతా భావంతో ఫిట్‌నెస్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఆరోగ్యం పాడుచేసుకొంటున్నారు, లావుగా ఉండడం అంటే అనారోగ్యంగా ఉండడం కాదు.. అని చెప్పే ప్రయత్నం చేశారు. సైజ్ జీరోలో. ఆర్య, అనుష్కలాంటి స్టార్ కాస్టింగ్, కీరవాణిలాంటి సాంకేతికనిపుణులూ, పీవీపీ లాంటి పెద్ద సంస్థ ఈ కాన్సెప్ట్ కి తోడయ్యాయి. మరి సైజ్ జీరో అనుకొన్నంత పెద్ద 'సైజ్'లో కనిపించిందా? అనుష్క కష్టం ఫలించిందా, ఈ కాన్సెప్ట్‌లో ఉన్న దమ్మెంత?? చూద్దాం.. రండి.
స్వీటీ (అనుష్క) ఓ బొద్దావతారం. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. కానీ... లావు కారణంగా ఆ సంబంధాలన్నీ రిజక్ట్ అవుతుంటాయి. అమ్మ(ఊర్వశి) ఫిట్‌నెస్ సెంటర్‌కి వెళ్లి లావు తగ్గించుకో అంటూ ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు. కీమా సమోసాలూ, జిలేబీలూ తినీ తినీ బరువు పెంచుతూ ఉంటుంది. నన్ను నన్నుగా ఇష్టపడే ఓ రాకుమారుడు ఎప్పుడో ఒకప్పుడు వెదుక్కొంటూ వస్తాడు.. అంటుంది. అభి (ఆర్య)లో తనకు నచ్చిన వరుడ్ని చూసుకొంటుంది. అభికి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఎక్కువ. డైట్ కూడా ఓ పద్ధతిలో ఫాలో అవుతుంటాడు. శుభ్రత అంశంపై ఓ డాక్యుమెంటరీ తీసే పనిలో ఉంటాడు. ఈ కథలోకి సిమ్రన్ (సోనాల్ చౌహాన్) ఎంట్రీ ఇస్తుంది. సిమ్రన్‌తో అభి చనువుగా ఉండడం చూసి కుళ్లిపోతుంటుంది స్వీటీ. చివరకి సిమ్రన్‌నీ, అభినీ చూడరాని స్థితిలో చూసి షాక్ తింటుంది. లావుగా ఉండడం వల్లే అభి తనని పట్టించుకోవడం లేదని, తన సమస్యకు ఒళ్లు తగ్గడం ఒక్కటే పరిష్కారమని భావించిన స్వీటీ.. సైజ్ జీరో సత్యానంద్ (ప్రకాష్‌రాజ్) ఫిట్‌నెస్ సెంటర్‌లో అడ్మిషన్ తీసుకొని సన్నజాజి నడుము తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. మరి ఆ ప్రయత్నాలు ఫలించాయా? స‌్వీటీ తన గమ్యం చేరుకొందా? అనేదే... ఈ కథ.
ఈ కథ తెలుసుకోవడానికి థియేటర్ వరకూ వెళ్లనవసరం లేదు. సైజ్ జీరో థియేటరికల్ ట్రైలర్ చూసినవాళ్లకెవ్వరికైనా ఈ విషయం అర్థమైపోతుంది. ఓ బొద్దుగుమ్మ.. సన్నజాజి నడుము తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నం ఈ సినిమా. అయితే పాయింట్ కంటే, వినోదం - భావోద్వేగాలపై దృష్టి పెట్టాడు దర్శకుడు. అనుష్క బొద్దావతారంలో చేసిన సన్నివేశాలు.. సరదాగానే సాగిపోతాయి. ఆర్యతో పెళ్లి చూపుల ఘట్టం, పార్కులో ఎక్సర్ సైజ్ చేస్తూ పడిన పాట్లు... నవ్విస్తాయి. కొంచెం కామెడీ, కొంచెం ఎమోషన్‌నీ బేస్ చేసుకొని కథని విశ్రాంతి వరకూ నడిపించాడు దర్శకుడు. అయితే ఇంట్రవెల్ తరవాత ట్రాక్ తప్పింది. వారంలో 10 కేజీల బరువు తగ్గిస్తామంటూ గొప్పలు చెప్పుకొని మోసం చేసే ఫిట్‌నెస్ సెంటర్లమీద స్వీటీ యుద్ధం మొదలవుతుంది. సెకండాఫ్ అంతా అదే. సన్నటి నడుం కోసం తిప్పలు పడొద్దని, బొద్దుగా ఉన్నా ఆత్మవిశ్వాసంతో ఉండడమే అందం అని చెప్పడం మంచిదే. కాకపోతే ఈ విషయం కోసం సినిమాలో సగ భాగం కేటాయించడం మాత్రం బోర్ కొట్టిస్తుంది. ఫస్టాఫ్ అంతా ఓ కథ, రెండో భాగం మాత్రం మరో కథ నడిచినట్టు అనిపిస్తుంది. ఆ ఉద్యమం కూడా సిల్లీగానే ఉంది. గ్రౌండ్‌లో సైకిల్స్ తొక్కుతూ క్యాలరీలు ఖర్చు చేయడం పైనే ఫోకస్ పెట్టాడు. దాంతో ఆ కథంతా ఆ గ్రౌండ్ దగ్గరే ఆగిపోయింది. సైకిల్ తొక్కడం కోసం తమన్నా, నాగార్జున, రానా, జీవా, హన్సిక.. ఇలాంటి స్టార్స్‌ని తీసుకొచ్చి బిల్డప్పులిచ్చే ప్రయత్నం చేశారు. అనుష్క క్యారెక్టరైజేషన్‌లోనూ లోపాలున్నాయి. ఆర్య ని పెళ్లి చూపుల్లో ఎందుకు రిజక్ట్ చేస్తుందో తెలీదు. అడవిశేష్ ని అంతలోనే ఎందుకు ఇష్టపడుతుందో అస్సలు అర్థం కాదు. ఆర్య - సోనాల్ చౌహాన్‌ల లవ్ ట్రాక్ కూడా అలానే ఉంది. బ్రహ్మానందం పండించిన వినోదం మరోసారి విసుగు పుట్టిస్తుంది. స్వామిజీ స్థానంలో ఉండి.. పైనా కిందా మూసుకో అని సంజ్ఞలతో చూపించడం వరస్టాతి వరస్ట్.
అనుష్క ఈ సినిమాకి ప్రధానబలం. తను పడిన కష్టం అంతా ఇంతా కాదు. అసలు ఇలాంటి పాత్ర పోషించడానికి ముందుకు రావడమే గ్రేట్. బొద్దావతరాంలో అనుష్క ముద్దుగా కనిపించింది. నిజంగానే అంత లావుగా ఉందా అనే అనుమానం వచ్చేలా నటించింది. అయితే ఒక్కో సన్నివేశంలో అనుష్క ఒక్కోలా కనిపించడం ప్రధాన డ్రాబ్యాక్. అనుష్క ఎక్స్‌ప్రెషన్స్ క్యూట్ క్యూట్‌గా ఉన్నాయి. తన కెరీర్‌లో ఇదో మంచి పాత్రగా మిగిలిపోవడం ఖాయం. ఆర్య కూడా ఇన్నోసెంట్‌గానే కనిపించాడు. సోనాల్ చౌహాన్‌ది గ్లామర్‌కి మాత్రమే పరిమితమైన పాత్ర. ప్రకాష్‌రాజ్ ఎప్పట్లా రొటీన్‌గా చేసుకొంటూ పోయాడు. ఊర్వశి నటన మెప్పిస్తుంది. గొల్లపూడి మారుతిరావు చాలాకాలం తరవాత తెరపై కనిపించారు. అలీ ఉన్నా శుద్ధ దండగే.
సాంకేతిక విభాగం విషయానికొస్తే కీరవాణి సంగీతానికి, నేపథ్య సంగీతానికి మంచి మార్కులు పడతాయి. జీరో జీరో సైజ్ జీరో హుషారుగా సాగిపోతోంది. అనుష్కపై తెరకెక్కించిన మరో మాస్ గీతం కూడా బాగుంది. మెల్లమెల్లమెల్లగా.. కీరవాణి నుంచి మాత్రమే ఆశించగల మెలోడీ. కెమెరాపనితనం ఆకట్టుకొంటుంది. చివర్లో వీడియో గేమ్స్ తరహాలో డిజైన్ చేసిన గ్రాఫిక్స్ పిల్లలకు నచ్చుతాయి.
లావు అనేది నేటితరం అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్య. అయితే వాళ్లలో విశ్వాసం పెంచేలా కొన్ని సన్నివేశాల్ని ఇందులో పొందుపరచడం బాగుంది. కానీ అవి ఏమాత్రం కనెక్ట్ అవుతాయా అన్నది ప్రశ్నార్థకమే. ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే... సైజ్ జీరో కాన్సెప్ట్‌ని ఆత్రే నమ్ముకొన్న కథ. అనుష్క కోసమైతే ఓసారి చూడొచ్చంతే.
రేటింగ్ 2/5
Also Read