ENGLISH | TELUGU  

'శ్యామ్ సింగ రాయ్' కథ ఇదేనా?.. ఇంట్రెస్టింగ్ డీటైల్స్‌!

on Dec 21, 2021

శ్యామ్ సింగ రాయ్. నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. నాని ద్విపాత్రిభినయం పోషించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో పాటు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు అందించిన స‌మాచారం మేర‌కు అసలు ఈ మూవీ కథ ఎలా ఉండబోతుందో ఊహించి.. సినిమా విడుదలకు ముందే మిమ్మల్ని 'శ్యామ్ సింగ రాయ్' ప్రపంచంలోకి తీసుకెళ్ళబోతున్నాం.

'శ్యామ్ సింగ రాయ్' కథ మొదట ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రారంభమై.. ఆ తర్వాత 1970 సమయంలో కలకత్తాలో జరిగిన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. మొదట నాని 'వాసు' అనే పాత్రలో దర్శనమిస్తాడు. సినిమా పిచ్చితో సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసిన వాసు.. దర్శకుడిగా తన ప్రతిభను చాటుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఒక బ్యూటిఫుల్ స్టోరీని రెడీ చేసుకున్న వాసు.. 'లో బడ్జెట్' సినిమాని ప్లాన్ చేస్తాడు. అందులో హీరోయిన్ గా నటించే అమ్మాయి కోసం వెతుకుతుండగా కృతి శెట్టి తారసపడుతుంది. అలా వీరిద్దరికి పరిచయం ఏర్పడుతుంది. 'లో బడ్జెట్' మూవీ కావడంతో లొకేషన్స్ కి పర్మిషన్ తీసుకోకుండా సైలెంట్ గా షూట్ చేస్తూ ఉంటారు. అలా ఒకసారి పోలీసులకు కూడా చిక్కుతారు. 

ఇలా ఓ వైపు షూటింగ్ కోసం వాళ్ళు పడే అవస్థలతో సరదాగా సాగుతుండ‌గానే వాసు, కృతి ఒకరికొకరు బాగా దగ్గరవుతారు. అలా ఇద్దరూ ప్రేమలో మునిగిపోయి సాఫీగా సాగుతున్న వారి జీవితాల్లో అనుకోని ఘటన ఒక‌టి జరుగుతుంది. షూటింగ్ లొకేషన్ లో అయిన ఒక గొడవలో వాసు గాయ‌ప‌డ‌తాడు. తలకి బలమైన గాయం కావడంతో క‌థ‌లో కీల‌క మ‌లుపు వ‌స్తుంది. తనలా ఉన్న ఒక వ్యక్తికి సంబంధించిన కొన్ని సంఘటనలు పదే పదే అత‌డి మెదడులో మెదులుతూ ఉంటాయి. కృతితో పాటు వాసు ఫ్రెండ్స్.. అత‌నికి ఏం జరిగిందోనని ఆందోళన చెంది డాక్టర్ ని సంప్రదిస్తారు. వాసు మాత్రం తనలా ఉన్న ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నం మొదలుపెడతాడు.

డైరెక్టర్ కావాలన్న డ్రీమ్ లో ఉన్న వాసుకు.. పుస్తకాలు చదవటం, కథలు రాయడం అలవాటు. అలా తనలా ఉన్న వ్యక్తి గురించి తెలుసుకునే క్రమంలో కొన్నేళ్ల క్రితం ప‌బ్లిష్ అయిన‌ ఓ బుక్ వాసు కంటపడుతుంది. అందులో కలకత్తాకు చెందిన శ్యామ్ సింగ రాయ్ గురించి ఉంటుంది. అసలు ఈ శ్యామ్ సింగ రాయ్ ఎవరు? అంటూ 1970ల లోకి కథ వెళుతుంది. శ్యామ్ సింగ రాయ్ ఒక ప్రముఖ రచయిత. తన కలంతో ఎందరినో కదిలించగలడు. ఎంతో గొప్ప భావాలు కలిగిన ఆయన.. మూఢాచారాలను విశ్వసించడు. తన రచనలతో, చేతలతో ప్రజలను మేల్కొలుపుతాడు. 

అలాంటి వ్యక్తి దేవదాసి పాత్రలో కనిపించే సాయి పల్లవితో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమే అత‌డిని దేవదాసి వ్యవస్థపై పోరాడేందుకు దారి తీస్తుంది. ఈ దురాచారాన్ని రూపుమాపడానికి శ్యామ్‌సింగరాయ్‌ పెద్ద పోరాటమే చేస్తాడు. ఆనాటి సమాజంలో పేరుకుపోయిన దేవదాసి వ్యవస్థ తాలూకు చీకటి కోణాలను బయటపెడతాడు. దేవదాసిగా ఉన్న సాయిపల్లవిని రక్షించి పెళ్లి చేసుకుంటాడు. ఇలా పోరాటం చేసే క్రమంలో శ్యామ్‌సింగరాయ్‌ ఒక పవర్ ఫుల్ నాయకుడిగా ఎదుగుతాడు. అయితే చెడు ఆలోచనలు ఉన్న మతపెద్ద.. మరికొందరితో కలిసి శ్యామ్ సింగ రాయ్ ఫ్యామిలీపై ఎటాక్ చేపిస్తాడు. ఈ దాడిలో సాయిపల్లవి మరణిస్తుంది. ఆ తర్వాత తాను చేయాలనుకున్న ఒక పని పూర్తి కాకుండానే శ్యామ్ సింగ రాయ్ కూడా కన్నుమూస్తాడు. కొన్నేళ్ళ తర్వాత శ్యామ్ సింగ్ రాయే మళ్ళీ 'వాసు'గా జన్మించి తనని తాను వెతుక్కుంటూ వెళ్లి.. గత జన్మలో తాను నెరవేర్చుకోలేకపోయిన పనిని పూర్తి చేస్తాడు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.