పవన్‌తోనా... రూమరే!
on Feb 26, 2020
పవన్ కళ్యాణ్ పక్కన కథానాయిక ఎవరు? ఈ ప్రశ్న పై అటు పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఒకటికి రెండు సినిమాలలో పవన్ పక్కన కథానాయికలను ఎంపిక చేయాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ రెండు సినిమాలు చేస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న పింక్ రీమేక్ ఒకటి. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న జానపద జానర్ సినిమా మరొకటి. రెండు సినిమాల షూటింగులు మొదలయ్యాయి. రెండిటిలోనూ పవన్ పక్కన కథానాయికగా ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదు. అయితే పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో శృతి హాసన్ పేరు కూడా ఉంది. పవన్ తో సినిమా చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని శృతి హసన్ తెలిపారు. అది జస్ట్ రూమర్ మాత్రమే అని ఆమె అన్నారు. ప్రస్తుతం తెలుగులో మాస్ మహారాజా రవితేజ పక్కన 'క్రాక్', తమిళంలో విజయ్ సేతుపతి పక్కన 'లాభం' చిత్రాల్లో మాత్రమే నటిస్తున్నట్లు శృతిహాసన్ స్పష్టం చేశారు. పవన్, శృతిది హిట్ జోడి. 'గబ్బర్ సింగ్', 'కాటమరాయుడు' చిత్రాలలో ఇద్దరూ జంటగా నటించారు. 'గబ్బర్ సింగ్' శృతిహాసన్ కు తెలుగులో బ్రేక్ ఇవ్వడంతో పాటు ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.