ఆయన జ్నాపకాలు చెరగని శిలాక్షరాలు...
on Jul 3, 2017
‘నడకలో కొదమ సింగపు అడుగులున్న మొనగాడా...’ అన్న సినారె పాటకు నిలువెత్తు రూపం ఎస్వీ రంగారావు. నిజంగా ఎస్వీయార్ నడుస్తుంటే కొదమ సింగం నడుస్తున్నట్టే ఉంటుంది. ఆ నడక, హావభావ
ప్రకటన, గాంభీర్యం, రాజసం, ఎస్వీఆర్ లో తప్ప మరో నటుడులో చూడలేం. అందుకే ఆయనతో నటన అంటే.. సాటి మహానటులు సైతం జాగ్రత్త పడేవారు.
ఉదాహరణకు ’నర్తనశాల‘ సినిమానే తీసుకోండి. మహావీరుడు, మద్యపాన ప్రియుడు, కామాంధుడు, ’సింహబల‘ బిరుదాంకుతుడైన కీచకునిగా ఆ సినిమాలో ఎస్వీయార్ నట విశ్వరూపం చూసి
తీరాల్సిందే. 1963లో విడుదలైన ఈ సినిమా జకార్తా ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడి, ప్రపంచ స్థాయి సినీ మేధావులు సైతం విస్తుపోయేలా చేసింది. ఎస్వీయార్ ను ’విశ్వనట చక్రవర్తి‘గా కొనియాడేలా చేసింది.
పైగా దాదాపు మూడు గంటల నిడివి ఉన్న ఆ సినిమాలో ఎస్వీయార్ కనిపించేది కేవలం 50 నిమిషాలు. ఆ కొద్ది సమయంలో లోనే అందరి మన్ననలు అందుకున్నారు ఎస్వీయార్.
’నర్తనశాల‘ వచ్చిన సరిగ్గా 16 ఏళ్ల తర్వాత... అదే కథతో ’శ్రీ మద్విరాటపర్వం‘ చిత్రం రూపొందించారు ఎన్టీయార్. ఆ సినిమాలో కీచక పాత్రను ఎన్టీయారే పోషించారు. ఈ కారణంగా ఆయన పలు
విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. ఎస్వీయార్ స్థాయిలో కీచక పాత్రను ఆయన మెప్పించలేకపోవడమే ఆ విమర్శలకు కారణం. అది ఎన్టీయారే పలు సందర్భాల్లో అంగీకరించారు.
ఎస్వీయార్ నటించిన అద్భుతమైన చిత్రరాజాల్లో ’తాతామనవడు‘ ఒకటి. కన్నబిడ్డ చేత మోసగింపబడ్డ తండ్రిగా ఆ సినిమాలో ఎస్వీయార్ నటన చూస్తే కళ్లు చమర్చక మానవు. ఎస్వీయార్ పోషించిన
పాత్రలను పరిశీలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. తెలుగు తెరపై ఆయన పండించని ఎమోషనే లేదు.
పాతాళభైరవి, భట్టి విక్రమార్క, బాలనాగమ్మ తదితర చిత్రాల్లో క్రూరమైన మాంత్రికుడిగా భయపెట్టిన ఆయనే... ఆత్మబంధువు, నాదీ ఆడజన్మే, కలసివుంటే కలదు సుఖం, పండంటి కాపురం, తాతామనవడు ..
తదితర చిత్రల్లో కరుణ రసాన్ని అనితర సాథ్యంగా పోషించి ప్రేక్షకుల హృదయాలు ద్రవింపజేశారు. మిస్సమ్మ, గుండమ్మకథ, అప్పుచేసి పప్పుకూడు, పెళ్లిచేసి చూడు, తోడికోడళ్లు, మాంగళ్యబలం చిత్రల్లో
అయితే... సహజసిద్ధమైన హాస్యన్ని పండించి నవ్వుల పువ్వులు పూయించారు.
ఇక ఎస్వీయార్లో మరో కోణం పురాణ పాత్రలు. దుర్యోధన, కీచక, హిరణ్యకశిప, ఘటోత్కచ, రావణ, మయరావణ, నరకాసుర, కంస... ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా. రెండా! ఆ చిత్రాల్లో ఎస్వీయార్ నటనకు
జనాలు వేల వీరతాళ్లు వేశారు. జగత్ కిలాడీలు, జగత్ జెట్టీలు చిత్రాల్లో యాక్షన్ హీరోగా కూడా అదరహో అనిపించారాయన.
ప్రభుత్వ పురస్కారాలేవీ ఎస్వీయార్ ని వరించలేదు. అయితేనేం... తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాల్లో చదిరిపోని స్థానం ఎస్వీయార్ ది. నేడు ఆయన జయంతి. 99 ఏళ్లు పూర్తి చేసుకొని వందో యేట
అడుగుపెడుతున్నారాయన. భౌతికంగా ఎస్వీయార్ మన మధ్య లేకపోయినా.. ఆయన జ్నాపకాలు, చెరగని శిలాక్షరాలుగా జన హృదయాల్లో నిలిచే ఉంటాయని సగర్వంగా చెబుతూ... ఆ మహానటుడిని ‘తెలుగు వన్’ అందిస్తున్న ఘనమైన నివాళి .