రిషి కపూర్ కన్నుమూత
on Apr 30, 2020

భారతీయ చలనచిత్ర పరిశ్రమకు మరో తీరని లోటు. ఇర్ఫాన్ ఖాన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లాడన్న చేదు నిజాన్ని చిత్రసీమ వర్గాలు, ప్రేక్షకులు జీర్ణించుకోవడానికి ముందే మరో దిగ్గజ నటుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు. గురువారం ఉదయం ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ మరణించారు. అనారోగ్యంతో బుధవారం ఆసుపత్రిలో చేరిన ఆయన, ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.
బాలీవుడ్‌లో రిషి కపూర్ ఫ్యామిలీది ఘన చరిత్ర. కపూర్ ఫ్యామిలీలో ఆయన మూడో తరం నటుడు. మూకీ సినిమాల యుగంలో నటుడిగా కెరీర్ ప్రారంభించి, హిందీ సినిమా అభివృద్ధికి బాటలు వేసిన అలనాటి మేటి నటుడు... పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాల గ్రహీత పృథ్వీరాజ్ కపూర్ మనవడు, రాజ్ కపూర్ కుమారుడు ఈ రిషి కపూర్. వారసుడిగా హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినా... తనకంటూ ప్రత్యేక గుర్తింపు, నటుడిగా గౌరవాన్ని రిషి కపూర్ సొంతం చేసుకున్నారు.
మూడేళ్ల వయసులో రిషి కపూర్ తెరంగేట్రం చేశారు. రాజ్ కపూర్ 'స్త్రీ 420'లో 'ప్యార్ హువా... ఇక్ రారు హువా' పాటలో మరో ఇద్దరు చిన్నారులతో కలిసి రిషి కపూర్ కనిపించారు. ఆ పాటలో డాన్స్ చేయడానికి నర్గిస్ తనకు చాకోలెట్స్ లంచంగా చూపించారని ఒకానొక సందర్భంగా రిషి కపూర్ చెప్పారు. బాలనటుడిగా ఆయన తొలి చిత్రం 'మేరా నామ్ జోకర్'. రాజ్ కపూర్ హీరోగా నటించిన ఆ సినిమాలో, హీరో చిన్నప్పటి పాత్ర పోషించారు. ఆ పాత్రకు నేషనల్ అవార్డు అందుకున్నారు. హీరోగా రిషి కపూర్ తొలి సినిమా 'బాబీ'. రొమాంటిక్ హీరో అంటే బాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తు వచ్చే హీరోల్లో రిషి కపూర్ పేరు తప్పకుండా ఉంటుంది. సుమారు 90 సినిమాల్లో ఆయన రొమాంటిక్ హీరోగా నటించారు. అందులో సగం సినిమాలు విజయాలు అందుకున్నాయి.
రిషి కపూర్ సతీమణి నీతూ సింగ్ కూడా హీరోయినే. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పన్నెండు సినిమాల్లో జంటగా నటించారు. కపూర్ ఫ్యామిలీలో దాదాపుగా అందరూ నటీనటులే. రిషి కపూర్ కుమారుడు రణబీర్ కపూర్, ఈతరం యువత మెచ్చిన హీరో.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



