2021 జ్ఞాపకాలుః రీమేక్ చిత్రాల సందడి!
on Dec 21, 2021

టాలీవుడ్ లో రీమేక్ మూవీస్ కొత్తేమీ కాదు. ప్రతీ ఏడాది ఈ తరహా సినిమాలొస్తుంటాయి. ఈ సంవత్సరం కూడా ఈ జాబితాలో కొన్ని చిత్రాలు చేరాయి. టాప్ స్టార్స్, మీడియం స్టార్స్, బడ్డింగ్ స్టార్స్.. ఇలా అన్ని వర్గాలకు చెందిన కథానాయకులు రీమేక్ సినిమాల్లో సందడి చేశారు. వాటిలో కొన్ని విజయం సాధించగా.. మరికొన్ని నిరాశపరిచాయి. ఇంకొన్ని ఓటీటీ వేదికల్లో పలకరించాయి. ఆ వివరాల్లోకి వెళితే..
వకీల్ సాబ్ః ఈ యేటి మేటి గ్రాసర్స్ లో ఒకటైన `వకీల్ సాబ్`.. హిందీ కోర్ట్ డ్రామా `పింక్`కి రీమేక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రి-ఎంట్రీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితం రాబట్టింది. పవన్ కి మంచి కమ్ బ్యాక్ ఫిల్మ్ గా నిలిచింది.
నారప్ప - దృశ్యం 2: ఈ రెండు రీమేక్స్ లోనూ సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా నటించారు. తమిళ చిత్రం `అసురన్` ఆధారంగా `నారప్ప` రూపొందితే.. మాలీవుడ్ ఓటీటీ సెన్సేషన్ `దృశ్యం 2`కి రీమేక్ గా `దృశ్యం 2` తెరకెక్కింది. ఫ్యామిలీ థ్రిల్లర్స్ గా తయారైన ఈ రెండు రీమేక్స్ కూడా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో నాలుగు నెలల వ్యవధిలో స్ట్రీమ్ అయ్యాయి. వెంకీ అభిమానులను, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ రీమేక్స్ ద్వయం విశేషంగా అలరించాయి.
రెడ్ః తమిళ సినిమా `తడమ్`కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం కోసం ఎనర్జిటిక్ స్టార్ రామ్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశాడు. సంక్రాంతి స్పెషల్ గా సందడి చేసిన ఈ రీమేక్.. టికెట్ విండోస్ దగ్గర ఎబౌవ్ యావరేజ్ గా నిలిచింది.
మాస్ట్రోః బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అంధాధున్` ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించాడు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయిన ఈ క్రైమ్ థ్రిల్లర్.. మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
అలాగే కన్నడ ఫిల్మ్ `బీర్బల్` ఆధారంగా తెరకెక్కిన `తిమ్మరుసు` (సత్యదేవ్) ఓకే అనిపించుకోగా.. మరో కన్నడ చిత్రం `కవలుధారి`కి తెలుగు వెర్షన్ అయిన `కపటధారి` (సుమంత్), మలయాళ మూవీ `ఇష్క్`కి రీమేక్ గా అదే పేరుతో తెరకెక్కిన `ఇష్క్` (తేజ సజ్జ), కన్నడ సినిమా `దియా` రీమేక్ `డియర్ మేఘ` (మేఘా ఆకాశ్) ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి.
మొత్తంగా.. 2021లో తెలుగునాట సందడి చేసిన రీమేక్స్ కి మిశ్రమ ఫలితాలు దక్కాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



