రవితేజ నుండి మరో రెట్రో సినిమా
on Feb 24, 2020
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెట్రో జోనర్ సినిమాల సంఖ్య పెరుగుతోంది. కథల్లో కొత్తదనం కోసం కాలంలో వెనక్కి వెళ్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'జాన్' 1980 నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న చిత్రమే. రవితేజ కూడా 1980 నేపథ్యంలో సాగే కథతో మరో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపేశారు. ఆల్రెడీ రవితేజ ఒక రెట్రో సినిమా చేశారు. అదే 'డిస్కో రాజా'. అందులో రవితేజ నటన అభిమానులను ఆకట్టుకుంది. కానీ, ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అయినా... రెట్రో జోనర్ మీద రవితేజ నమ్మకం పెట్టుకున్నారు.
'మేం వయసుకు వచ్చాం', 'నువ్విలా నేనిలా', 'సినిమా చూపిస్త మావ', 'నేను లోకల్', 'హలో గురు ప్రేమకోసమే' చిత్రాల దర్శకడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయనున్నాడని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ ఆ సినిమా కథ విషయంలో ఒక క్లారిటీకి వచ్చారు. త్రినాథరావు నక్కిన రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ చెప్పిన కథకు రవితేజ ఆమోద ముద్ర వేశారు. లవ్, ఫ్రెండ్ షిప్, రొమాన్స్, రివేంజ్, కామెడీ మేళవింపుతో 1980 నేపథ్యంలో కథతో ఈ సినిమా తెరకెక్కనుందని టాక్. ప్రస్తుతం రవితేజ 'క్రాక్' సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత ఈ సినిమా పట్టాల ఎక్కే అవకాశం ఉంది.