రవితేజ 'రావణాసుర' రీమేక్ సినిమానా!
on Mar 27, 2023
మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రావణాసుర'. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. 'ధమాకా' సక్సెస్ తో జోరు మీదున్న రవితేజ మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ఈ ఓటీటీ యుగంలో రీమేక్ సినిమా తీసి మెప్పించడం అంత తేలిక కాదు. ఏదైనా కొత్త సినిమా, ఫలానా సినిమాకి రీమేక్ అని తెలియగానే.. వెంటనే ఓటీటీలో వెతికి మరీ ఒరిజినల్ ఫిల్మ్ చూసేస్తున్నారు ఆడియన్స్. దాంతో రీమేక్ సినిమా చూడాలనే ఆసక్తి తగ్గిపోవడం లేదా ఒకవేళ చూసినా ఒరిజినల్ ఫిల్మ్ తో పోల్చి చూడటం వంటివి జరుగుతుంటాయి. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒరిజినల్ ఫిల్మ్ చూసిన వాళ్ళకి ముందే ట్విస్ట్ లు తెలిసిపోవడంతో.. వారికి రీమేక్ సినిమా అంతగా కిక్ ఇవ్వదు. ఆ ఉద్దేశంతోనే 'రావణాసుర' ఓ బెంగాలీ సినిమాకి రీమేక్ అనే విషయాన్ని మేకర్స్ దాస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
2019 లో బెంగాలీలో విడుదలైన సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్ 'విన్సీ డా' విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను మెప్పించింది. ఈ 'విన్సీ డా'కి రీమేక్ గానే 'రావణాసుర' తెరకెక్కినట్లు టాక్. అయితే ఇది రీమేక్ అనే విషయాన్ని ఇంతవరకు మూవీ టీమ్ మాత్రం ఎక్కడా చెప్పలేదు. పైగా దీనికి శ్రీకాంత్ విస్సా కథ అందించినట్లుగా ప్రచార చిత్రాల్లో ఉంది. మరి ఇది ఒరిజినల్ కథనా? లేక 'విన్సీ డా'కి రీమేకా? అనేది త్వరలోనే తేలిపోనుంది.
Also Read