నారా వారితో రానా.. నిమ్మకూరులో ఎన్టీఆర్..!!
on Aug 4, 2018
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఎన్టీఆర్ బయోపిక్.. ఈ బయోపిక్ అనౌన్స్ చేసినప్పటి నుండే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు, ఆసక్తి ఏర్పడ్డాయి.. బాలకృష్ణ కథానాయకుడిగా చేస్తున్న ఈ బయోపిక్ కి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.. మరోవైపు ఈ సినిమాలో పలువురు హీరోలు, హీరోయిన్లు కొన్ని ముఖ్యపాత్రలు పోషించనున్నారు.. అయితే నారా చంద్రబాబు పాత్రలో రానా నటించబోతున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.. తాజా పరిణామాలు చూస్తుంటే ఆ వార్త నిజమనిపిస్తుంది.
తాజాగా బాలకృష్ణ, క్రిష్, రానా, చంద్రబాబుతో భేటీ అయ్యారు.. ఈ భేటీలో ఎన్టీఆర్ సినిమాతోపాటు, ఏపీలో సినీపరిశ్రమ అభివృద్ధి గురించి చర్చించినట్టు తెలుస్తోంది.. అయితే ఈ భేటీతో నారా వారి పాత్రలో రానా కనిపించడం నిజమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. మరోవైపు ఈరోజు డైరెక్టర్ క్రిష్‌తో కలిసి నిమ్మకూరు వెళ్లిన బాలకృష్ణ తన తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ 'ఎవరైతే, వాళ్లు పుట్టిన కుటుంబానికి, ఊరికి, జాతికి, దేశానికి ఖ్యాతిని తీసుకొస్తారో వాళ్లే మహానుభావులు అనిపించుకోవడానికి అర్హులు.. వారిలో ఎన్టీఆర్ ఒకరు.. నిమ్మకూరు అనేది ఆయన పుట్టిన ఊరు.. వ్యక్తిగతంగా ఆయన సినిమా చేయడానికి కారణాలు.. ఒకటేమో ఒక నటుడిగా నాపై ఉన్న ప్రభావం.. రెండవది తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం.. ఎన్టీఆర్ ఎన్నో పథకాలకు నాంది పలికాడు.. దేశం మొత్తం కూడా ఆ పథకాలను అనుసరిస్తున్నాయి.. కాబట్టి అలాంటి మహనీయుడి కథను భావితరాలకు అందజేయాలని నాకు అనిపించింది..ఒక తండ్రి పాత్రలో కొడుకు నటించడమనేది చరిత్రలో ఎప్పుడూ జరగని విషయం.. కొడుకే తండ్రి జీవిత చరిత్రను నిర్మించడం.. నిర్మాతగా నా మొదటి సినిమా కావడం.. నా బ్యానర్‌లో తీయడం.. ఒక కాకతాళీయం' అని అన్నారు.. అలానే నిమ్మకూరులో అక్టోబర్ చివరిలో కానీ, నవంబర్‌లో కానీ ఎన్టీఆర్ షూటింగ్ ఉంటుందని తెలిపారు.