నానా నహీ... 'హౌస్‌ఫుల్4' రానా!
on Oct 22, 2018
ఒక్క అక్షరం మారితే పేరు మారుతోంది. నానా పేరులో మొదటి 'నా' తీసేసి 'రా' పెట్టండి... నానా పేరు కాస్తా రానా అవుతుంది. హిందీ సినిమా 'హౌస్‌ఫుల్4'లో 'నా' తీసేసి 'రా' పెట్టారు. అదేనండీ... నానాను సినిమా నుంచి తప్పించి రానాను తీసుకున్నారు. తెలుగు నటుడు రానా దగ్గుబాటిని ముంబై రమ్మని కబురు పెట్టారు. రానా కూడా రెక్కల విమానం ఎక్కి ముంబై వెళ్ళడానికి రెడీ అయ్యారని సమాచారం.
నానా పటేకర్ తనను లైంగికంగా వేధించారని తానూశ్రీ దత్తా ఆరోపణలు చేయడంతో 'హౌస్‌ఫుల్4' నుంచి అతణ్ణి తప్పించి.. ఆ పాత్రకు కొత్త నటుణ్ణి తీసుకోవాలని యూనిట్ డిసైడ్ అయ్యిందట! 'మీ టూ' దెబ్బకు 'హౌస్‌ఫుల్4' టీమ్‌లో జరుగుతున్న రెండో మార్పు ఇది. ఇప్పటికే దర్శకుడు సాజిద్ఖాన్ని తప్పించి, ఫర్హాద్ సంజిని తీసుకున్నారు. ఇతను 'హౌస్‌ఫుల్3'కి దర్శకత్వం వహించాడు. నానా పటేకర్, సాజిద్‌ఖాన్‌పై 'మీ టూ' ఆరోపణలు రావడంతో సినిమా చిత్రీకరణను వాయిదా వేయమని, ఆరోపణలు వచ్చిన వ్యక్తులతో తనకు పని చేయడం ఇష్టం లేదని, వారు నిర్దోషులుగా తిరిగి వచ్చాక చిత్రీకరణ ప్రారంభిద్దామని హీరో అక్షయ్ కుమార్ నిర్మాతలను కోరారు. భారీ మల్టీస్టారర్ సినిమా కనుక, చిత్రీకరణ వాయిదా వేస్తే... మళ్ళీ ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ కావడం కష్టమని నిర్మాతలు దర్శకుణ్ణి మార్చారు. ఇప్పుడు నానాను మార్చాలని నిర్ణయించారు. అదే రానాకు వరమైంది. మరో హిందీ సినిమా అవకాశాన్ని తెచ్చింది. 'హౌస్‌ఫుల్4' నిర్మాతలకు, రానాకు మధ్య చర్చలు పూర్తయ్యాయని, రానా అగ్రిమెంట్ పేపర్ సంతకం చేస్తే అధికారిక ప్రకటన వస్తుందని ముంబై మీడియా టాక్.