‘సైరా’ కాంట్రవర్సీలో కొత్త ట్విస్ట్
on Sep 26, 2019
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులమని చెబుతూ... మెగాస్టార్ చిరంజీవి తనయుడు, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రనిర్మాత రామ్‌చరణ్ తమను మోసం చేశాడంటూ... గత మూడు నాలుగు రోజులుగా కొందరు మీడియా ముందుకొచ్చి మాటల బౌన్సర్లు విసురుతున్నారు. ఉయ్యాలవాడ కథతో సినిమాను తెరకెక్కించారు కనుక, ఆయన వారసులమైన తమకు చిత్రనిర్మాణ వ్యయంలో పది శాతం రూ. 50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తమకు డబ్బులు అందే వరకూ సినిమా సెన్సార్ చేయకూడదని అందులో పేర్కొన్నారు. గురువారం ‘సైరా’ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. ఉయ్యాలవాడ వారసులు బౌన్సర్లు సంధిస్తే... ‘సైరా’ చిత్రదర్శకుడు సురేందర్‌రెడ్డి గూగ్లీ వేశారు. ‘సైరా నరసింహారెడ్డి’ బయోపిక్ కాదంటూ కోర్టుకు తెలిపి పెద్ద బాంబు పేల్చారు. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. దీనిపై ఉయ్యాలవాడ వారసులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే... ప్రచార చిత్రాల్లో ఈ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ అని యూనిట్ చెబుతోంది. ఇంటర్వ్యూల్లో ఉయ్యాలవాడ చరిత్రపై చాలా పరిశోధన చేశామని సురేందర్‌రెడ్డి, చిత్రబృందంలో ఇతర కీలక వ్యక్తులు చెప్తున్నారు. ట్రైలర్ లాంచ్‌లో రామ్‌చరణ్ అయితే ఉయ్యాలవాడ నివసించిన ప్రాంతానికి ఏమైనా చేస్తాను తప్ప.. కొందరు వ్యక్తులకు చేయనని స్పష్టం చేశాడు. మరోపక్క ఉయ్యాలవాడ అసలైన వారసులు తామేనని కొందరు మీడియా ముందుకు వచ్చారు. చిరంజీవి కుటుంబానికి మద్దతుగా నిలిచారు. ఈ వివాదం చివరికి ఎన్ని మలుపులు తీసుకుంటుందో?