రాహు మూవీ రివ్యూ
on Feb 28, 2020
నటీనటులు: కృతి గార్గ్, అభిరామ్ వర్మ, సుబ్బు వేదుల, ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్ తదితరులు
ఎడిటింగ్: అమర్ రెడ్డి
సినిమాటోగ్రఫీ: ఈశ్వర్ యల్లు మహంతి ,సురేష్ రగతు
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
నిర్మాతలు: ఎవిఆర్ స్వామి, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల
రచన-దర్శకత్వం: సుబ్బు వేదుల
విడుదల తేదీ: 28 ఫిబ్రవరి 2020
ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమాల్లో చిన్న సినిమా 'రాహు' ఒకటి. నటీనటులు, దర్శక నిర్మాతలు కొత్తవారు అయినప్పటికీ సినిమాపై ప్రేక్షకులు ఓ మాదిరి ఆసక్తి ఏర్పడింది. రక్తం చూస్తే ఒత్తిడికి గురై కళ్లు కనిపించని హీరోయిన్ క్యారెక్టరైజేషన్ తో చేసిన సినిమా అనేసరికి ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు పాటలు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన 'ఏమో ఏమో' సాంగ్ సినిమాపై క్రేజ్ తీసుకొచ్చింది. మరి, సినిమా ఎలా ఉంది? రివ్యూ చదివి తెలుసుకోండి.
కథ:
భాను (కృతి గార్గ్) ఆరేళ్ల వయసులో తల్లిని కోల్పోతుంది. క్యాన్సర్ మహమ్మారితో ఆమె తల్లి పోరాడి పోరాడి పైలోకాలకు వెళుతుంది. అప్పటినుండి గెలవలేమని తెలిసినప్పుడు ఫైట్ చేయడం అనవసరం అనే అభిప్రాయానికి వస్తుంది. భానుకి కన్వర్షన్ డిజార్డర్. రక్తం చూస్తే కళ్లు కనపడవు. ఒత్తిడికి గురై కాసేపు చూపును కోల్పోతుంది. ఒత్తిడి తగ్గి తిరిగి యథాస్థితికి వచ్చినప్పుడు చూపు వస్తుంది. అసలు కథలోకి వెళితే... భాను తండ్రి (సుబ్బు వేదుల) పోలీస్ కమిషనర్. ఆమె చిన్నతనంలో నాగరాజు (ప్రభాకర్) అనే గ్యాంగ్‌స్టర్‌ని పట్టుకుంటాడు. ఆ సమయంలో 'ఎప్పటికైనా నీ కూతురిని చంపేస్తా' అని నాగరాజు శపథం చేస్తాడు. కట్ చేస్తే... భాను పెద్దదవుతుంది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తుంది. భార్య అంత్యక్రియలకు బయటకొచ్చిన నాగరాజు, పోలీసుల నుండి తప్పించుకుంటాడు. అదే సమయంలో భాను కిడ్నాప్ అవుతుంది. ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు? భాను కిడ్నాప్ అయిందని తెలిసిన తర్వాత ఆమెను రహస్యంగా వివాహం చేసుకున్న శేష్ (అభిరామ్ వర్మ) ఏం చేశాడు? అసలే కన్వర్షన్ డిజార్డర్ ఉన్న భాను సమస్య నుండి ఎలా గట్టెక్కింది? ఇటువంటి పలు ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి. ఆయా కథలను సమాజంలో పరిస్థితులకు అన్వయిస్తూ సినిమాగా తీయాలనుకోవడం మంచి ప్రయత్నమే. అయితే... ఆ ప్రయత్నాన్ని ఎంత ప్రభావవంతంగా చెప్పారనే దానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది. 'రాహు' సినిమా విషయానికి వస్తే... గ్రహణం గురించి వేదాలు, పురాణాల్లో ఉంది. సూర్యుడిని కాసేపు రాహువు మింగేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ విధంగా జీవితంలో తనను గ్రహణంలా పట్టి పీడిస్తున్న సమస్యతో పాటు, తన జీవితానికి గ్రహణంలా పట్టిన ఒక వ్యక్తి నుండి ఒక అమ్మాయి ఏ విధంగా బయటపడింది? అనేది చిత్రకథాంశం. కథగా సినిమా బావుంది. కథ మాత్రమే వింటే తప్పకుండా బావుంటుంది. ఈ కథను చక్కటి కథనంతో, మంచి సినిమాగా తెరపైకి తీసుకు రావడంలో సుబ్బు వేదుల తడబడ్డారు. కథనం విషయంలో ఆయన వేసిన తప్పటడుగులు, నటీనటుల ఎంపికలో చేసిన తప్పిదాలు సినిమాపై ప్రభావం చూపించాయి. అందుకు ఫలితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తప్పలేదు.
సినిమా ప్రారంభంలో, కథానాయిక చిన్నతనంలో ఆమెకు రక్తం కనిపిస్తే కళ్లు కనిపించవనే పాయింట్ చెప్పేశారు. నాగరాజు అనే గ్యాంగ్‌స్టర్ వల్ల జీవితానికి ప్రమాదం ఉందనీ చెప్పారు. మళ్లీ కథానాయిక పెరిగి పెద్దదైన తర్వాత మరోసారి ఆ సంగతి చెప్పడానికి మరో సన్నివేశం పెట్టారు. కథకు అదేమంత ప్రయోజనాన్ని ఇవ్వలేదు. నిడివి పెంచడం తప్ప. తర్వాత నిస్సారమైన ప్రేమకథలోకి వెళ్లారు. హీరో హీరోయిన్ మధ్య చూపించిన ప్రేమ గానీ, ఆ ప్రేమకథలో వినోదం గానీ ఏమాత్రం ఆకట్టుకోదు. ఎంత మాత్రం సహించేలా లేదు. కథానాయికను కిడ్నాప్ చేసిన తర్వాత గతంలోకి వెళుతూ, మళ్ళీ వర్తమానంలోకి వస్తూ ప్రేక్షకుడిని గజిబిజి గందరగోళంలోకి నెట్టడం, విసుగు తెప్పించడం మినహా ఇంకేమీ చేయలేదు. చలాకి చంటి, గిరిధర్ పాత్రల వల్ల వినోదం పండకపోగా విసుగు వచ్చింది. విశ్రాంతికి ముందు వచ్చే మలుపు కాస్త ఆకట్టుకుంటుంది. మళ్లీ ద్వితీయార్థంలో నిస్సారమైన సన్నివేశాలు మొదలవుతాయి. కథలో ప్రధాన మలుపు వీడిన తర్వాత సినిమాలో చలనం వస్తుంది. అక్కడి నుండి పతాక సన్నివేశాల వరకు పర్వాలేదని అనిపిస్తుంది.
ఈ చిత్రానికి సుబ్బు వేదుల త్రిపాత్రాభినయం చేశారు. నటన, దర్శకత్వంతో పాటు నిర్మాణంలో భాగం పంచుకున్నారు. మూడు పాత్రల్లో దేనికీ సరైన న్యాయం చేయలేకపోయారు. కథానాయిక తండ్రిగా ఆయనే నటించడం బదులు ఆ పాత్రకు మరొకరిని తీసుకోవలసింది. దర్శకుడిగా ఆయన నటనలో ప్రతిభ ఎంత ఉందనేది అంచనా వేయడంలో విఫలమయ్యారు. 'బాహుబలి'లో కాలకేయగా నటించిన ప్రభాకర్, కృతి గార్గ్ మినహా మిగతా పాత్రలకు సరైన నటీనటులను తీసుకోవడంలోనూ, సాంకేతిక నిపుణుల నుండి చక్కటి ప్రతిభ రాబట్టుకోవడంలోనూ ఆయన విఫలమయ్యారు. ఛాయాగ్రహణం, కళా దర్శకత్వం, కూర్పు, నిర్మాణ విలువలు ఏవీ బాలేదు.
ప్లస్ పాయింట్స్:
ద్వితీయార్థంలో వచ్చే ప్రధాన మలుపు
'ఏమో ఏమో', 'ఇది ఒక గ్రహణం' పాటలు
పతాక సన్నివేశాల్లో కథానాయిక పోరాడిన తీరు
మైనస్ పాయింట్స్:
నటీనటులు
దర్శకత్వం
వినోదం
ప్రథమార్థంలో ప్రేమకథ, కథనం
సంభాషణలు
నటీనటుల పనితీరు:
భాను పాత్రకు కృతి గార్గ్ న్యాయం చేసింది. కానీ, ఆమె ప్రతిభ ప్రేక్షకులకు తెలిసేలా సన్నివేశాలు లేవు. అభిరామ్ వర్మనటనను భరించడం కష్టం. సుబ్బు వేదుల బదులు మరో నటుడు ఆ పాత్ర చేసుంటే కథకు, చిత్రానికి మంచి జరిగేది. ప్రభాకర్ పాత్ర పరిధి మేరకు చేశారు. మిగతా నటీనటుల గురించి మాట్లాడుకోవడం వల్ల సమయం వృధా తప్ప మరొకటి ఉండదు.
తెలుగుఒన్ పర్ స్పెక్టివ్:
మంచి కథాంశం తీసుకున్నప్పటికీ దర్శకుడు సరిగా తీయలేకపోయాడు. పాటలు బావున్నాయి. కొంచెం కష్టమైనా కొత్తవాళ్లను ప్రోత్సహించాలని అని ఆలోచించేవాళ్ళు చిత్రానికి వెళ్లండి.
రేటింగ్: 1.5/5