ట్రాఫిక్ ను కంట్రోల్ చేసిన నిర్మాత సురేష్ బాబు!
on Jan 3, 2023
హైదరాబాద్ లో ట్రాఫిక్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఒక్కోసారి చాలాసేపు రోడ్డుపైనే వాహనాలు నిలిచిపోవాల్సి ఉంటుంది. అన్ని చోట్లా ట్రాఫిక్ పోలీసులు ఉండటం సాధ్యంకాదు. అందుకే కొన్ని చోట్ల భారీ సంఖ్యలో వాహనాలతో రోడ్డు బ్లాక్ అవుతుంది. తాజాగా ఫిల్మ్ నగర్ లో అలాంటి పరిస్థితే ఏర్పడగా.. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేయడం విశేషం.
సిగ్నల్స్ లేని సమయంలో అన్ని వైపుల నుంచి వాహనాలు అడ్డదిడ్డంగా వచ్చి ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాంటి సమయంలో బాధ్యత తీసుకొని ట్రాఫిక్ క్లియర్ చేయాలనే ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది. తాజాగా జూబ్లీహిల్స్-ఫిల్మ్ నగర్ రోడ్డులో అలాగే ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. అప్పుడు ఆ రోడ్డు గుండానే పయనిస్తున్న సురేష్ బాబు.. కారు దిగి స్వయంగా ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ఆయనకు మరో ఇద్దరు సామాన్యులు కూడా తోడవ్వడంతో కొద్ది సమయంలోనే ట్రాఫిక్ అంతా క్లియర్ అయింది.
సురేష్ బాబు రోడ్డుపై నిల్చొని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సురేష్ బాబు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.