భార్యతో విడిపోయిన దర్శకేంద్రుడి కుమారుడు
on Aug 2, 2019
'అనగనగా ఓ ధీరుడు', 'సైజ్ జీరో' సినిమాల దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడి భార్యతో విడిపోయారని సమాచారం. ప్రకాశ్.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు. 2014లో స్క్రిప్ట్ రైటర్ కనికా థిల్లాన్‌ను ప్రకాశ్ పెళ్లాడారు. 'సైజ్ జీరో'తో పాటు ప్రకాశ్ తొలి హిందీ సినిమా 'జండ్జిమెంటల్ హై క్యా'కు కనిక స్క్రిప్ట్ సమకూర్చారు. కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావ్ జంటగా నటించిన 'జడ్జిమెంటల్ హై క్యా' మూవీ వారం రోజుల క్రితమే విడుదలైంది. అంతలోనే ప్రకాశ్, కనికా విడిపోయారనే వార్త పొక్కడంతో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. అయితే వాళ్లిద్దరూ వివాహ బంధానికి మాత్రమే స్వస్తి చెప్పారనీ, ప్రొఫెషనల్‌గా కలిసి పనిచేయడాన్ని కొనసాగిస్తారనీ తెలుస్తోంది. నిజానికి వాళ్లిద్దరూ రెండేళ్ల నుంచీ విడివిడిగానే ఉంటున్నారని చెప్పుకుంటున్నారు.
కాగా 'జడ్జిమెంటల్ హై క్యా' మూవీ విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా, బాక్సాఫీస్ దగ్గర మెరుగైన వసూళ్లను సాధిస్తోంది. సాధారణ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా తొలి వారం ప్రపంచవ్యాప్తంగా రూ. 36 కోట్ల గ్రాస్ సాధించింది. అయితే ఈ సినిమాను మొదట్నుంచీ వివాదాలు చుట్టుముట్టాయి. మొదట 'మెంటల్ హై క్యా' అనే టైటిల్ పెట్టడంపై డాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మానసిక రోగులను అది కించపరిచే విధంగా ఉందని వాళ్లు విమర్శించడంతో 'జడ్జిమెంటల్ హై క్యా'గా టైటిల్ మార్చారు. ఆ తర్వాత రిలీజ్ డేట్ల విషయంలో వివాదాలు ఏర్పడ్డాయి. ఆపైన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఒక జర్నలిస్టుతో కంగన జగడం పతాక శీర్షికలకెక్కింది. ఒకానొక సమయంలో కంగనను బాయ్‌కాట్ చెయ్యాలని జర్నలిస్టులు ఆలోచించారు కూడా.