విడుదలవుతుందా? లేదా? అని టెన్షన్ పడ్డా!
on Jul 11, 2019

కథానాయకుడిగా, నిర్మాతగా రెండు బాధ్యతలు భుజాన వేసుకుని సందీప్ కిషన్ చేసిన సినిమా 'నిను వీడని నీడను నేనే'. నిర్మాతగా అతడికి తొలి చిత్రమిది. శుక్రవారమే విడుదల! అయితే... బుధవారం ఉదయం వరకూ సినిమా విడుదలవుతుందా? లేదా? అని టీమ్ అంతా టెన్షన్ పడ్డారట. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందీప్ కిషన్ ఈ విషయాన్ని చెప్పాడు. "ఒకడు సినిమా తీస్తున్నాడంటే, సంబంధమే లేకుండా దాన్ని ఆపడానికి కొందరు బయలుదేరతారు. నా సినిమాను 12న సినిమా విడుదల చేయాలనుకుంటున్నానని అంటే... ఓ నలుగురు 'ఎవరిని అడిగి రిలీజ్ డేట్ డిసైడ్ చేశావ్?' అన్నారు. అదేంటి? అన్నాను. 'నువ్వు సినిమా రెడీ చేసుకో. ఎప్పుడు విడుదల చేయాలో మేం చెప్తాం' అన్నారు. 'సార్... నేనే సినిమా తీశా. నేను విడుదల చేయాలని అనుకున్నప్పుడు రిలీజ్ చేసుకుంటా' అని వాళ్లకు చెప్పాను. అన్నిటి కన్నా సినిమా గొప్పది. సినిమాను ఆ సినిమాయే కాపాడుకుంటూ వస్తుంది. అదే 'నిను వీడని నీడను నేనే'. దీనికి విపరీతమైన అడ్డంకులు వచ్చాయి. నాకే షాక్. అడ్డంకులు దాటుకుని విడుదలకు వచ్చాం. ఇదొక మిరాకిల్" అని సందీప్ కిషన్ అన్నారు. సెట్‌లో ఎవరికీ ఏ లోటు చేయకుండా, ఎవరికీ ఒక్క రూపాయి కూడా మోసం చేయకుండా సినిమా తీశానని ఆయన అన్నారు. తన కెరీర్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ సినిమా 'నిను వీడని నీడను నేనే' అని సందీప్ కిషన్ తెలిపారు. తప్పకుండా సినిమా విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



