తనికెళ్ల భరణికి గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించిన ఎస్‌ఆర్ యూనివర్సిటీ...
on Jul 25, 2024
రచయితగా, నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు తనికెళ్ల భరణి (Tanikella Bharani). పదుల సంఖ్యలో రచయితగా, వందల సంఖ్యలో నటుడిగా సినిమాలు చేసి మెప్పించారు. పలు పుస్తకాలను సైతం రచించారు. ఇలా సాహితీ, సినీ రంగాల్లో ఎంతో సాధించిన తనికెళ్ల భరణికి గురువారం నాడు వరంగల్ ఎస్‌ఆర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది.
ఆగష్టు 3 శనివారం వరంగల్ లో జరిగే ఎస్‌ఆర్ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకలో ఆయనకు డాక్టరేట్ ను ప్రధానం చేయనున్నారు. 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ విద్యా సంస్థ యూనివర్సిటీ గా మారిన తర్వాత ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్‌ను గౌరవ డాక్టరేట్‌తో గతంలో సత్కరించింది.
50 సినిమాలకు పైగా మాటలను అందించి రచయితగా అనేక విజయాలను అందుకున్నారు తనికెళ్ల భరణి. రాష్ట్ర ప్రభుత్వం నుండి 'సముద్రం' సినిమాకు ఉత్తమ విలన్‌గా, 'నువ్వు నేను' సినిమాలోని నటనకు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, 'గ్రహణం'తో ఉత్తమ నటునిగా, 'మిథునం' సినిమాకు గాను ఉత్తమ రచయిత మరియు ఉత్తమ దర్శకునిగా ఐదు నంది అవార్డులను అందుకున్నారు.
Also Read