నటుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్.. ఒకరు మృతి
on Oct 1, 2023
ఓ నటుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన శనివారం రాత్రి బెంగళూరులో చోటుచేసుకుంది. వసంతపుర మెయిన్ రోడ్డు వద్ద కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నటుడు నాగభూషణ కారు.. మొదట ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి, ఆ తర్వాత ఫుట్ పాత్ పై వెళ్తున్న జంటను ఢీ కొట్టిందట. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. హాస్పిటల్ కి తరలించగా.. అప్పటికే భార్య మృతి చెందింది. భర్త చికిత్స తీసుకుంటున్నాడు.
నిర్లక్ష్యపు డ్రైవింగే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నాగభూషణను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
2018 లో కన్నడ పరిశ్రమలో నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన నాగభూషణ.. 'ఇక్కత్', 'బడవ రాస్కెల్', 'కౌసల్యా సుప్రజా రామా' వంటి సినిమాల్లో నటించాడు.