బీజేపీలోకి మంచు లక్ష్మి.. ఒకే ఫ్యామిలీలో ఇన్ని పార్టీలా!
on Sep 21, 2023
ఎందరో సినీ సెలబ్రిటీలు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే రాజకీయాల్లో సక్సెస్ అయిన సినిమావాళ్లు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. ఇప్పుడు నటి మంచు లక్ష్మి సైతం పాలిటిక్స్ లో తన లక్ ని టెస్ట్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
మంచి లక్ష్మి బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. "ఢిల్లీ వైబ్స్" అంటూ తాజాగా ఆమె చేసిన ట్వీట్ ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది.
మంచు ఫ్యామిలీ చాలాకాలం నుంచి ప్రధాని మోడీకి, బీజేపీకి దగ్గరగా ఉంటూ వస్తుంది. అయితే వాళ్ళు బీజేపీలో మాత్రం చేరలేదు. గతంలో టీడీపీకి మద్దతుగా నిలిచిన మోహన్ బాబు.. ఆయన పెద్ద కుమారుడు విష్ణు, వైఎస్ బంధువురాలిని పెళ్లి చేసుకోవడంతో.. వైఎస్ కుటుంబానికి దగ్గరై 2019 ఎన్నికల సమయంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. మోహన్ బాబు ఈమధ్య పాలిటిక్స్ లో యాక్టివ్ గా లేనప్పటికీ, విష్ణు మాత్రం మా బావ అంటూ వైఎస్ జగన్ కి దగ్గరగా ఉంటున్నారు. ఇక మనోజ్ విషయానికొస్తే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ని ఇష్టపడతారు. కానీ ఆయన భార్య భూమా మౌనిక కుటుంబం మాత్రం టీడీపీలో కీలకంగా ఉంది. ఇక ఇప్పుడు లక్ష్మి బీజేపీలో చేరితే మంచు కుటుంబంలో పలు పార్టీల జెండాలు ఉన్నట్లు అవుతుంది. మరి లక్ష్మి నిజంగానే బీజేపీలో చేరతారా? చేరితే ఎన్నికల బరిలో నిలుస్తారా? నిలిస్తే తెలంగాణాలో పోటీ చేస్తారా లేక ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.