ENGLISH | TELUGU  

నీవెవరో మూవీ రివ్యూ

on Aug 24, 2018

 

నీవెవరో మూవీ రివ్యూ

తారాగ‌ణం : ఆది పినిశెట్టి, తాప్సీ,  రితికాసింగ్‌, వెన్నెల కిషోర్, స‌ప్త‌గిరి త‌దిత‌రులు
ద‌ర్శ‌కుడు : హ‌రినాథ్‌
నిర్మాణ సంస్థ : కోన  ఫిలిమ్ కార్పొరేష‌న్, ఎం.వి.వి.సినిమా
నిర్మాత‌లు : కోన వెంక‌ట్‌, ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌
సినిమాటోగ్ర‌ఫీ : సాయిశ్రీ‌రామ్‌
జోన‌ర్ : రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌

కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్య‌మైన క‌థాంశాల్ని ఎంచుకుంటూ ప్ర‌తిభావంతుడైన న‌టుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు  ఆది పినిశెట్టి. అటు క‌థానాయకుడిగా, ఇటు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. ఆయ‌న సినిమా అంటే ఏదో కొత్త‌ద‌నం ఉంటుంద‌ని ఆశిస్తారు ప్రేక్ష‌కులు. రంగ‌స్థ‌లం త‌ర్వాత ఆది తెలుగులో న‌టించిన చిత్రం 'నీవెవ‌రో'. త‌మిళ చిత్రం 'అదే కంగ‌ల్‌'కు రీమేక్ ఇది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా క‌థాంశంలో కొన్ని మార్పులు చేసి  తెర‌కెక్కించారు. స‌క్సెస్‌ఫుల్ రైట‌ర్‌గా పేరున్న కోన వెంక‌ట్ ఈ సినిమా నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించ‌డం ఆస‌క్తిని పెంచింది. రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన 'నీవెవ‌రో' క‌థా వివ‌రాలేమిటో చూద్దాం..

క‌థ‌

క‌ల్యాణ్ (ఆది పినిశెట్టి) జ‌న్మ‌తః అంధుడు. హైద‌రాబాద్‌లో ఒక రెస్టారెంట్‌లో చెఫ్‌గా ప‌నిచేస్తుంటాడు. ఓ సంద‌ర్భంలో అత‌నికి వెన్నెల (తాప్సీ)తో ప‌రిచ‌య‌మ‌వుతుంది. పేద‌లు, నిరాశ్రయుల బాగు కోసం అనుక్ష‌ణం త‌పించే వెన్నెల మంచితనం న‌చ్చి ఆమె ప్రేమ‌లో ప‌డ‌తాడు క‌ల్యాణ్‌. వాలెంటైన్స్ డే రోజున త‌న ప్రేమ విష‌యం చెప్పాల‌నుకుంటాడు. ఇంత‌లో త‌న తండ్రి కోసం చేసిన అప్పు తీర్చ‌డానికి కొంత డ‌బ్బు కావాల‌ని క‌ల్యాణ్‌ను కోరుతుంది వెన్నెల‌. ఈలోగా క‌ల్యాణ్‌కు యాక్సిడెంట్ అవుతుంది. కొన్ని రోజుల త‌ర్వాత కోలుకున్న క‌ల్యాణ్‌కు అనూహ్యంగా కంటిచూపు వ‌స్తుంది.  వెన్నెల అడిగిన స‌హాయం గుర్తుకొస్తుంది. ఆమె ఎక్క‌డ ఉందో తెలుసుకోవ‌డానికి అన్వేష‌ణ ప్రారంభిస్తాడు. అయితే వెన్నెల ఆచూకి తెలుసుకోలేక‌పోతాడు. కల్యాణ్ ప‌రిస్థితి చూసి జాలిప‌డిన త‌ల్లిదండ్రులు అత‌నికి పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యిస్తారు. మొద‌టి నుంచి క‌ల్యాణ్ అంటే ఇష్ట‌ప‌డే అను (రితికాసింగ్‌)తో నిశ్చితార్థం జ‌రిపిస్తారు. నిశ్చితార్థం రోజున వెన్నెల తండ్రి క‌ల్యాణ్ ఇంటికి వ‌చ్చి త‌న  కూతురుకు ఓ గ్యాంగ్ వ‌ల్ల ముప్పు ఉంద‌ని, 25ల‌క్ష‌లు ఇచ్చి త‌న కూతురుని కాపాడాల‌ని ప్రాధేయ‌ప‌డ‌తాడు. అందుకు స‌రే అంటాడు క‌ల్యాణ్‌. ఇంత‌లో వెన్నెల తండ్రిని హ‌త్య చేసిన గ్యాంగ్ ఆమెను త‌మ‌తో తీసుకువెళతారు. తిరిగి వెన్నెల అన్వేష‌ణ‌లో బ‌య‌లుదేరిన క‌ల్యాణ్ ఎలాంటి ప‌రిస్థితుల్ని ఎదుర్కొన్నాడు? ఈ క్ర‌మంలో అత‌ను తెలుసుకున్న‌నిజాలేమిటి? అస‌లు వెన్నెల ఎవ‌రు? ఆ గ్యాంగ్‌తో ఆమెకున్న సంబంధం ఏమిటి? అనే ప్ర‌శ్న‌ల‌కు  స‌మాధానంగా మిగ‌తా చిత్ర క‌థ న‌డుస్తుంది.

విశ్లేష‌ణ‌..

ఓవ‌రాల్‌గా ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌. దీనికి ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ‌ను జోడించి చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు.  థ్రిల్ల‌ర్ క‌థ‌ల‌కు ప‌క‌డ్బందీ క‌థ‌నంతో పాటు ఉత్కంఠ‌ను రేకెత్తించే స‌న్నివేశాల కూర్పు చాలా ముఖ్యం. క‌థాగ‌మ‌నం ఎక్క‌డ మంద‌గించినా ప్రేక్ష‌కులు బోర్‌గా ఫీల‌య్యే ప్ర‌మాదం ఉంటుంది. ఈ క‌థ‌లో అలాంటి ఉత్కంఠ‌, మ‌లుపులు లోపించాయి. ఎంచుకున్న పాయింట్‌లో విషమున్న‌ప్ప‌టికి దానిని తెర‌పై ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌డంలో వైఫ‌ల్యం క‌నిపిస్తుంది.  ప్ర‌థ‌మార్థాన్ని నాయ‌కానాయిక‌ల ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ‌తో మొదలుపెట్టిన ద‌ర్శ‌కుడు ఆ స‌న్నివేశాల్ని పేల‌వంగా తీర్చిదిద్దాడు. దాంతో ఫస్ట్‌హాఫ్ అంతా నెమ్మ‌దిగా సాగే స‌న్నివేశాల‌తో ఓ సీరియ‌ల్‌ని త‌ల‌పించింది.  తాప్సీ మిస్సింగ్ ఎపిపోడ్‌తోనే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. ద్వితీయార్థంలో క‌థ టేకాఫ్ తీసుకుంటుంది. అయితే అక్క‌డ కూడా ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డిన‌ట్లుగా అనిపిస్తుంది. చ‌క్క‌టి స్క్రీన్‌ప్లేతో ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా న‌డిపించే వీలున్న క‌థ‌లో అన‌వ‌స‌ర‌పు స‌న్నివేశాల్ని జొప్పించి గంద‌ర‌గోళానికి గురిచేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా క‌ల్యాణ్ వెన్నెల జాడ‌ను ఎలా తెలుసుకున్నాడ‌నే అంశ‌మీద‌నే ద్వితీయార్థాన్ని న‌డిపించారు.  అయితే ఆ స‌న్నివేశాల్లో కావాల్సినంతం స‌స్పెన్స్‌ను కొనసాగించ‌లేక‌పోయారు. లాజిక్‌కు అంద‌ని సీన్స్‌తో ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షించిన‌ట్లుగా అనిపిస్తుంది. వెన్నెల ఎవ‌రో తెలిసిన త‌ర్వాత క‌థ‌లో థ్రిల్ మిస్స‌వుతుంది. ముగింపు ఏమిటో తెలిసిపోవ‌డంతో క‌థ‌తో ఏమాత్రం ట్రావెల్ చేయ‌లేక‌పోతారు. హీరో, విల‌న్ మ‌ధ్య న‌డిచే మైండ్‌గేమ్‌, ఎత్తుకుపై ఎత్తుల‌ను ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్ద‌లేక‌పోయారు.  ఏ స‌న్నివేశంలో కొత్త‌ద‌నం క‌నిపించ‌దు. ఎప్పుడో పాత సినిమా జిమ్మిక్కుల‌ను వాడుతూ సినిమాను న‌డిపించార‌నే భావ‌న క‌లుగుతుంది.

న‌టీన‌టుల ప‌నితీరు..

ఈ సినిమాకు తాప్సీ పెద్ద ఎస్సెట్ అంటూ చిత్ర బృందం ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో ప‌దేప‌దే వెల్ల‌డించింది. చెప్పిన‌ట్టుగానే క‌థ ఆసాంతం తాప్సీ చుట్టూ న‌డిపించారు. ప్ర‌తినాయిక ఛాయ‌ల‌తో కూడిన పాత్ర‌లో తాప్సీ చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌ర‌చింది. అయితే క‌థాబ‌లం లేక‌పోవ‌డంతో ఆమె ప్రయ‌త్న‌మంతా వృథా అయిపోయిన‌ట్లుగా అనిపించింది. గ‌త రెండేళ్లుగా తాప్సీ బాలీవుడ్‌లో అర్థ‌వంత‌మైన, మ‌హిళా ప్ర‌ధాన పాత్ర‌ల్లో రాణిస్తున్న‌ది. ఇలాంటి సినిమాలు ఆమె స్థాయిని ఏమాత్రం పెంచేవి కావు. ఇక ఆది త‌న‌దైన స‌హ‌జ న‌ట‌నను ప్ర‌ద‌ర్శించాడు. గుడ్డివాడిగా, ప్రేయ‌సిని దూరం చేసుకొని నిరంత‌రం సంఘ‌ర్ష‌ణ‌కు లోన‌య్యే వ్య‌క్తిగా భిన్న కోణాలున్న పాత్ర‌లో రాణించాడు. కానిస్టేబుల్ చొక్కారావుగా వెన్నెల కిషోర్ త‌న‌దైన టైమింగ్‌తో చ‌క్క‌టి హాస్యాన్ని పండించాడు. సెకండాఫ్‌లో ఆయ‌న పాత్ర కాస్త రిలీఫ్‌నిస్తుంది. రితికాసింగ్  ఫ‌ర్వాలేద‌నిపించింది. సాయిశ్రీ‌రామ్ ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. రొమాంటిక్ ఎపిసోడ్స్‌ను క‌ల‌ర్‌ఫుల్‌గా ప్ర‌జెంట్ చేశాడు. అచ్చు, ప్ర‌సేన్‌, గిబ్రాన్ బాణీలు ఫ‌ర్వాలేద‌నిపించాయి. నిర్మాణ‌ప‌రంగా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. మేకింగ్ వాల్యూస్ చాలా  బాగున్నాయి.

తీర్పు...

ఉత్కంఠ‌త మిస్ అయిన రొమాంటిక్ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. ఆది, తాప్సీ వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్న‌ప్ప‌టికి క‌థ‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఆవిష్క‌రించ‌లేక‌పోయారు. ప్ర‌స్తుతం థ్రిల్ల‌ర్‌జోనర్స్ ట్రెండ్‌మారుతోంది. క‌థ‌లో న‌వ్య‌త‌, దానిని తెర‌పై తీసుకొచ్చే విధానంలో ప‌ర్‌ఫెక్ష‌న్ ఉన్న సినిమాల్నే ప్రేక్ష‌కుల ఆద‌రిస్తున్నారు. మంద‌గమనంతో బోరింగ్‌గా సాగిన ఈ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ ప్రేక్ష‌కుల్ని ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుంద‌నేది సందేహ‌మే.

రేటింగ్‌: 2

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.