'బిల్డప్ బాబాయ్'లా మారిపోయిన 'జాతిరత్నం'
on Jan 16, 2022
'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి.. 'జాతి రత్నాలు' సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. నవీన్ కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్నాడు నవీన్. అతను హీరోగా నటిస్తున్న నెక్స్ట్ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్ తాజాగా విడుదలైంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నవీన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ శంకర్ దర్శకుడు. ఈ సినిమాకి 'అనగనగా ఒక రాజు' అనే టైటిల్ ని పెట్టినట్లు తెలియజేస్తూ తాజాగా మేకర్స్ టైటిల్ టీజర్ ని విడుదల చేశారు.
'అనగనగా ఒక రాజు' టైటిల్ టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ రాజు గాడి పెళ్లి అంటే ఎలా ఉండాలి అంటూ బిల్డప్ బాబాయ్ ని గుర్తు చేస్తూ నవీన్ మెప్పించాడు. 'ఆడవాళ్ళకేనా వడ్డాణం.. అందుకే 5 కేజీల బంగారంతో wwf బెల్ట్ లాంటిది చేపించాను అంటూ నవీన్ నవ్వులు పూయించాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాతో ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తానని నవీన్ అంటున్నాడు. చూద్దాం మరి 'అనగనగా ఒక రాజు' సినిమాతో ఈ జాతిరత్నం ఏ స్థాయిలో మెప్పిస్తాడో.