'వి', 'టక్ జగదీష్' సినిమాలు ఫ్లాప్ అంటే ఒప్పుకోను!
on Dec 22, 2021

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. డిసెంబర్ 24 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నాని మీడియాతో మచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గత చిత్రాలు 'వి', 'టక్ జగదీష్' ఫ్లాప్ అంటే ఒప్పుకోనని అన్నారు.
కరోనా కారణంగా నాని గత రెండు చిత్రాలు 'వి', 'టక్ జగదీష్' నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలతో నాని ప్రేక్షకులను నిరాశపరిచాడన్న అభిప్రాయముంది. అయితే నాని మాత్రం ఆ రెండు కూడా కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయని అంటున్నారు. తాను నటించిన 'MCA' సినిమాకి 'టక్ జగదీష్' కంటే తక్కువ రేటింగ్ ఇచ్చారని.. కానీ అది భారీ వసూళ్లతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని గుర్తుచేశారు. 'MCA' థియేటర్స్ లో విడుదలైంది కాబట్టి, అది హిట్ అయ్యిందని చెప్పడానికి కలెక్షన్స్ ని ప్రూఫ్ గా చూపించొచ్చు.. కానీ ఓటీటీలో విడుదలైన సినిమాలకు ఆ అవకాశంలేదని నాని అన్నారు.
థియేటర్స్ లో హిట్ అయిన సినిమాను, ఆ తర్వాత ఓటీటీలో చూసి 'ఈ సినిమాని ఎలా హిట్ చేశామని' అనుకున్న సందర్భాలు చాలా ఉంటాయి. అలాగే 'వి'', 'టక్ జగదీష్' కూడా ఒకవేళ థియేటర్స్ లో విడుదలైతే హిట్ అయ్యేవేమో అని నాని అన్నారు. ఓటీటీలో విడుదలైనా ఆ రెండు సినిమాల రిజల్ట్ పట్ల తాము నిరాశచెందలేదని.. ఆ సినిమాలకి అయిన బిజినెస్ పట్ల ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉన్నారని చెప్పారు. అలాగే, ఓటీటీలో కూడా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చి విడుదలైన గంటల్లోనే టాప్ లోకి వచ్చాయని తెలిపారు. ఆ రెండు సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టే.. 'శ్యామ్ సింగ రాయ్'కి ఓటీటీ నుంచి భారీ ఆఫర్ వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే అప్పుడు తప్పక ఓటీటీలో విడుదల చేశామని, ఇప్పుడు అవకాశముండటంతో థియేటర్స్ కి వస్తున్నామని అన్నారు. థియేటర్ లో ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లి రెస్పాన్స్ చూడటం తనకిష్టమని నాని చెప్పుకొచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



