నాని చిత్రాన్ని వాయిదా వేయక తప్పదా?
on Mar 11, 2020
ప్రస్తుతానికి ఉగాది బరిలో మార్చి 25న విడుదల కావడానికి 'వి' సినిమా ముస్తాబవుతోంది. అయితే సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఫిలింనగర్ గుసగుస. బుధవారమే సినిమాలో 'వస్తున్నా వచ్చేస్తున్నా' పాటను కూడా విడుదల చేశారు. అంతకు ముందు 'మనసు మారే' పాట విడుదల చేశారు. ఆల్రెడీ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా సవ్యంగా జరుగుతున్నాయి. ఎటువంటి అడ్డంకులు లేవు. మరి, సినిమా విడుదలకు అడ్డంకి ఏంటి? అంటే... కర్ణుడి చావుకి కోటి కారణాలు అన్నట్టు 'వి' సినిమాపై చాలా వచ్చి పడుతున్నాయి.
పదో తరగతి పరీక్షలు మార్చి 25కి కంప్లీట్ కావడం లేదు. అవి కంప్లీట్ అయ్యేవరకు ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలకు రావడం కష్టమే. దీనికి తోడు తెలుగు రాష్ట్రాల్లో కరోనా భయంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గింది. అమెరికాలో అయితే ఎవరూ థియేటర్లవైపు అడుగులు వేయడం లేదు. ఈ నేపథ్యంలో సినిమాను విడుదల చేయడం శ్రేయస్కరం కాదని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు 'వి' నిర్మాత 'దిల్' రాజుపై ఒత్తిడి చేస్తున్నారట. ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారోనని వాళ్లంతా ఎదురు చూస్తున్నారు.