ఆమిర్ కోసం చైతూ వార్
on May 3, 2021
వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు యువసామ్రాట్ నాగచైతన్య. `మజిలీ`,`వెంకిమామ` రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసిన చైతూ.. త్వరలో `లవ్ స్టోరి`తో పలకరించనున్నాడు. అలాగే.. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో చేస్తున్న `థాంక్ యూ` చిత్రీకరణ దశలో ఉంది. అంతేకాదు.. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కథానాయకుడిగా రూపొందుతున్న హిందీ చిత్రం `లాల్ సింగ్ చద్ధా`లోనూ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నాడు చైతూ.
కాగా, 2021 క్రిస్మస్ ని టార్గెట్ చేసుకున్న `లాల్ సింగ్ చద్ధా`కి సంబంధించి ఒకే ఒక షెడ్యూల్ పెండింగ్ ఉందట. 45 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ ని లడఖ్, కార్గిల్ లో ప్లాన్ చేశారని టాక్. ఓ పోరాట ఘట్టంతో పాటు యుద్ధ సన్నివేశాలను కూడా ఈ షెడ్యూల్ లో తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్ లోనే చైతూ కూడా జాయిన్ కానున్నాడట. ఆమిర్, చైతూ అండ్ కో మధ్య సాగే ఈ సన్నివేశాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని బజ్.
1994 నాటి హాలీవుడ్ మూవీ `ఫారెస్ట్ గంప్` ఆధారంగా తెరకెక్కుతున్న `లాల్ సింగ్ చద్ధా`లో ఆమిర్ కి జంటగా కరీనా కపూర్ నటిస్తుండగా.. `సీక్రెట్ సూపర్ స్టార్` ఫేమ్ అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నాడు.