నాగచైతన్య అభిమానికి సమంత నుండి పిలుపు
on Nov 25, 2019
అక్కినేని వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తనకంటూ వీరాభిమానులను నాగచైతన్య సొంతం చేసుకున్నాడని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా శనివారం బొబ్బిలికి చెందిన సాగర్ అనే అభిమాని మోకాళ్ళతో సింహాచలం కొండ ఎక్కాడు. నిండునూరేళ్ళు చైతన్య, సమంత దంపతులు చల్లగా ఉండాలని కోరుకున్నాడు. అతడు సింహాచలం కొండ మెట్లు ఎక్కుతున్నప్పుడు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాటిని సమంత చూశారు. భర్త నాగచైతన్యపై చూపిస్తున్న అభిమానానికి తనకు మాటలు రావడం లేదని ఆమె అన్నారు. ఆ అభిమాని సాగర్ కు సమంత నుండి పిలుపు వచ్చింది. "ప్లీజ్... మమ్మల్ని కలవండి" అని అభిమానిని ఉద్దేశిస్తూ సమంత ట్వీట్ చేశారు.
నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా 'వెంకీమామ', శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అతడు నటిస్తున్న సినిమా టీజర్లు విడుదలయ్యాయి. అభిమానులకు అవెంతగానో నచ్చాయి. ఆనందాన్ని ఇచ్చాయి. వాటికంటే సాగర్ మోకాళ్ళ మీద సింహాచలం కొండ ఎక్కడం మరింత ఆనందాన్ని ఇచ్చింది.