మన ఊరి రామాయణం రివ్యూ
on Oct 7, 2016
కథలు వెతకడం బ్రహ్మ విద్య కాదు. చాలా చిన్న చిన్న పాయింట్లలోనూ ఆసక్తికరమైన కథ దొరకవొచ్చు. దాన్ని రెండు గంటల సినిమాగానూ మలచవొచ్చు. కానీ అలాంటి పాయింట్లని వెదికిపట్టుకోవడానికి కూడా ఓ కళాత్మక హృదయం ఉండాలి. ఈ విషయంలో మలయాళీ దర్శకులు కొత్త కొత్తగా ఆలోచిస్తుంటారు. వాళ్ల పాయింట్లు చూస్తే... `ఇలాంటి విషయాలతో కూడా సినిమాలు తీయొచ్చా` అనిపిస్తుంటుంది. మలయాళంలో వచ్చిన షట్టర్ అలాంటి కథే. ఓ ఊరి పెద్ద మద్యం తాగిన మత్తులో ఓ వేశ్యని రప్పించుకొంటాడు. మధ్యలో తన గౌరవం గుర్తొస్తుంది. ఈ సంగతి తెలిస్తే లోకం, ఊరు ఏమనుకొంటుందో అంటూ భయం పట్టుకొంటుంది. కనీసం ముట్టుకోనన్నా ముట్టుకోడు. ఆ వేశ్యని తిరిగిపంపించేద్దాంటే... అనుకోని ఆటంకం వస్తుంది. అందులోంచి ఎలా బయపడ్డాడు, తన పరువు ఎలా కాపడుకొన్నాడు అనేదే సినిమా. ఇలాంటి కథలు చదువుకోవడానికే కాదు. తెరపై చూపించుకోవడానికి కూడా బాగుంటాయి అని చెప్పిన సినిమా.. షట్టర్. దాన్ని తెలుగులో ప్రకాష్‌రాజ్ మన ఊరి రామాయణం పేరుతో రీమేక్ చేశాడు. ఆ ప్రయత్నం ఎలా సాగింది? మలయాళంలో దొరికిన అనుభూతి తెలుగు సినిమాతోనూ కలిగిందా, లేదా? తెలుసుకొందాం.. రండి.
* కథ
భుజంగం (ప్రకాష్ రాజ్) ఊరిలో పెద్దమనిషి. పరువే ప్రాణం. ఇంట్లో భార్యా పిల్లల్ని పరువు కోసం కట్టడి చేస్తుంటాడు. ఓ రోజు తాగి రోడ్డుపైకొస్తాడు. ఓ వేశ్య (ప్రియమణి) ని చూసి మనసుపడతాడు. తన ఇంటి ఎదురుగానే ఖాళీగా వున్న తన దుకాణానికి తీసుకెళ్తాడు. భుజంగం సహాయకుడైన శివ (సత్య) వారిద్దరిని షాపులో వుంచి, తాళం వేసి, గంటలో వస్తానని వెళ్తాడు. వేశ్యని తీసుకొచ్చాడే గానీ.. భుజంగానికి లోలోపల భయం. బయటకు తెలిస్తే పరువు పోతుందని ఒణికిపోతుంటాడు. అలాగని బయటకు పంపేద్దామంటే తాళం వేసి ఉంటుంది. గంటలో వస్తానన్న సత్య ఎంతకీ రాడు. దాంతో ఆ షాపులో రెండు రోజులు అలా వుండిపోవాల్సి వస్తుంది. మరి చివరికి ఏమైంది? వాళ్లిద్దరూ బయట పడ్డారా, లేదా? శివ ఎక్కడ ఉండిపోయాడు? తనకి ఎదురైన సినిమా దర్శకుడు (ఫృథ్వీ) కథేంటి?? ఇవన్నీ తెలుసుకోవాలంటే.. మన ఊరి రామాయణం చూడాల్సిందే.
* విశ్లేషణ
ఓ చిన్న పాయింట్ పట్టుకొని, ఆసక్తికరమైన కథగా మలచి, థ్రిల్లింగ్ అంశాలు జోడించి, నవ్వించి, ఆలోచింపజేసి, రెండుగంటల పాటు కూర్చోబెట్టి పంపండం మాటలు కాదు. ఈ విషయంలో మలయాళ మాతృక అయిన షట్టర్ కథకుడ్ని అభినందించాల్సిందే. ఆ పాయింటే నచ్చి ప్రకాష్‌రాజ్ ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకొచ్చాడు. తనదైన చిన్న చిన్న మార్పులు జోడించినా.. అది కొంత వరకే. మూల కథని, అక్కడి భావోద్వేగాలనీ దర్శకుడు ప్రకాష్ రాజ్ యాజ్ ఇట్ ఈజ్‌గా ఫాలో అయిపోయాడు. కథలోకి వెళ్లడానికి, పాత్రల పరిచయానికీ కాస్త టైమ్ పడుతుంది. ప్రియమణి ఎంట్రీతో కథ హైవే ఎక్కుతుంది. షాపులో, నాలుగు గోడల మధ్య దాదాపు 70 శాతం సన్నివేశాల్ని నడిపించాడు. కానీ బోర్ కొట్టదు. ఏమవుతుందా? భుజంగం దొరికేస్తాడా, లేదా? అనే టెన్షన్ పుడుతుంది.
ఓ మనిషి తాత్కాలిక సుఖం కోసం తప్పు చేయాలని అనుకొని, అది తప్పు అని తెలుసుకొని, అందులోంచి బయప పడడానికి ఓ పెద్ద మనిషి పడిన పాట్లు ఈ కథ. దానికి కాస్త వినోదం, థ్రిల్లింగ్ అంశాలు జోడించి చివరికి హార్ట్ టచింగ్ ఫినిష్ ఇచ్చాడు. ఫృద్వీ చేసిన గరుడ క్యారెక్టర్ కథలో ఉంటూనే వినోదం పండిస్తుంటుంది. డైలాగుల్లో పెద్ద పంచ్ లేకపోయినా, ఆ సందర్భం, ఫృద్వీ స్టైల్ కలసి ఆయా సంభాషణల్ని పండించాయి. పాత్రల పరిచయానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకొన్నాడు. అయితే వాటిని ముగించిన విధానం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ప్రియమణి, ఫృథ్వీ క్యారెక్టర్లకు సరైన జస్టిఫికేషన్ చేస్తే బాగుండేది. భుజంగం మారాడా, లేదా? అనేదీ క్లారిటీగా చూపించలేదు. తొలి సగంతో పోలిస్తే ద్వితీయార్థం నెమ్మదిగా సాగినట్టు, సాగదీసినట్టు అనిపిస్తుంది. పతాక సన్నివేశంలో దర్శకుడు చూపించాలనుకొన్న ఫీల్ ఎంత మందికి అర్థం అవుతుందో? ఈ సినిమాలో ఒకే ఒక్క పాట ఉంది. దాన్ని ఎండ్ టైటిల్స్‌లో వాడారు.
* నటీనటుల ప్రతిభ
ఈ సినిమాకి కర్త కర్త క్రియ ప్రకాష్‌రాజ్. నటుడిగా చూస్తే ప్రారంభ సన్నివేశాల్లో కాస్త ఓవర్ చేసినట్టు అనిపిస్తుంది. లౌడ్ వాయిస్‌తో మాట్లాడడం అన్ని చోట్లా సరికాదు. రాను రాను భుజంగం పాత్రలో పరిపూర్ణంగా ఒదిగిపోయాడుప్రకాష్ రాజ్. ద్వితీయార్థంలో ప్రకాష్ రాజ్ మాట్లాడింది తక్కువ. హావ భావాలతో నడిపించాడు. చాలా కాలం తరవాత ప్రియమణి చేసిన తెలుగు సినిమా ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే అదరగొట్టింది. వేశ్య పాత్రల్లో నటించడం అంత ఈజీ కాదు. ఒళ్లంతా కప్పుకొని చూపులతోనే శృంగారం ఒలికించి ఆకట్టుకొంది. ప్రియమణి అనే కథానాయిక ఉంది.. అనే విషయాన్ని గుర్తు చేసేలా ఈ పాత్ర సాగింది. సరైన జస్టిఫికేషన్ ఇస్తే.. ఈ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయేది. సత్యకు పెద్దగా అనుభవం లేదు. అయినా అటు ప్రకాష్‌రాజ్, ఇటు ప్రియమణిలకు దీటుగా నటించాడు. అయితే.. అక్కడక్కడా అతని పాత్ర కూడా ఓవరాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పటి వరకూ చూసిన ఫృద్వీ వేరు.. ఈ ఫృద్వీ వేరు. చాలా డీసెంట్‌గా నటించాడు. కానీ కామెడీ మిస్ అవ్వలేదు. ఫృద్వీ ని ఇలాక్కూడా వాడుకోవొచ్చా అన్నట్టు సాగిందీ పాత్ర.
* సాంకేతికంగా
ఈ సినిమాలో ఉన్నది ఒకే ఒక్క టైటిల్ సాంగ్. దాన్ని చూపించలేదు. ఎండ్ కార్డ్స్‌లో వాడారు. ఇళయరాజా నేపథ్య సంగీతం గొప్పగా ఉంది. మళ్లీ పాత ఇళయరాజాని వినే భాగ్యం దక్కింది. చిన్న రూమ్‌లో రెండు గంటల కథ నడపడం మామూలు విషయం కాదు. కెమెరామెన్, ఆర్ట్ దర్శకుల పనితనం కనిపిస్తుంది. సంభాషణలు గొప్పగా లేవు. కానీ... ఓకే అనిపిస్తాయి. స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం బాధ్యతలు వహించిన ప్రకాష్‌రాజ్... తన గత సినిమాలకంటే భిన్నమైన చిత్రాన్ని అందింవ్వగలిగాడు. బీసీ సెంటర్ల మాటేమోగానీ.. మల్టీప్లెక్స్ కి నచ్చే సినిమా ఇది.
రేటింగ్: 2.5