నాగార్జున సెంటిమెంట్ చైతూకి కలిసొస్తుందా..?
on Oct 7, 2016
సుమారు 863 సంవత్సరాల తర్వాత మళ్లీ మనముందుకు ప్రత్యేకంగా రెడీ అయి వచ్చింది ఈ ఏడాది అక్టోబర్ మాసం. 5 ఆదివారాలు, 5 సోమవారాలు, 5 శనివారాలు, దసరా, దీపావళి, బతుకమ్మ,పీర్లా పండుగలతో అరుదైన నెలగా మారింది. అందరికి ఏమో గానీ ఈసారి అక్కినేని అభిమానులకు మాత్రం ఈ అక్టోబర్ నెల ప్రత్యేకమైంది. ఎందుకంటే కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్లో ఆల్‌టైమ్ హిట్స్‌గా చెప్పుకునే సినిమాలన్ని అక్టోబర్ నెలలోనే రిలీజయ్యాయి. టాలీవుడ్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ గర్వంగా చెప్పుకునే "శివ" 1989 అక్టోబర్ 5న రిలీజయ్యింది. ఇక నాగ్‌ను రోమాంటిక్ స్టార్‌గా నిలబెట్టిన "నిన్నే పెళ్లాడుతా" 1996 అక్టోబర్ 4న రిలీజైంది. 1993 అక్టోబర్ 6న "అల్లరి అల్లుడి"గా వచ్చి నాగ్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అలాంటి నెలలో తన అదృష్టం పరీక్షించుకునేందుకు కింగ్ నటవారసుడు నాగచైతన్య రెడీ అయ్యాడు. చైతూ నటించిన ప్రేమమ్ ఇవాళ రిలీజ్ అవుతోంది. కెరిర్లో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్యకు అక్టోబర్ సెంటిమెంట్ బాగా కలిసి వస్తుందని..నాగ్ లాగే ఇమేజ్ సొంతం చేసుకుంటాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.