ENGLISH | TELUGU  

'మా' ఎలక్షన్స్.. అన్నయ్య దారెటు..?

on Mar 7, 2019

మార్చిలో సూర్యుడు ప్రతాపం చూపించడం మొదలుపెట్టాడు. మండుటెండలకు వేడి పెరిగింది. ఇటు తెలుగు సినిమా పరిశ్రమలోనూ వేడి పెరుగుతోంది. అయితే.. మండుటెండల వల్ల పెరుగుతోన్న వేడి కాదిది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వాతావరణం తెలుగు సినిమా పరిశ్రమలో వేడి పెంచుతోంది. తాజా మాజీ అధ్యక్షుడు శివాజీరాజా మరోమారు అధ్యక్ష పదివి అధిరోహించాలని అనుకోవడం అసలు తంటా మొదలైంది. శివాజీరాజా హయాంలో ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన నరేష్ 'మా' అధ్యక్ష పదవికి పోటీ పడాలని నిర్ణయించుకోవడంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. వీరిద్దరిలో ఎవరు విజయం సాధిస్తారు? అనే అంశంపై ఆసక్తి నెలకొంది.

శివాజీరాజా హయాంలో నరేష్ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తించారు. ఇద్దరి మధ్య అంతగా పొసగలేదని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇద్దరూ ఉప్పు నిప్పు అన్నట్టు వ్యవహరించారు. మీడియాకు ముందుకొచ్చి మరీ ప్రెస్ మీట్లు పెట్టుకుని ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. మా సిల్వర్ జూబ్లీ వేడుకల్లో అవకతవకలు జరిగాయని నరేష్ ఆరోపించడం, తరవాత ఇండస్ట్రీ పెద్దలు ఇద్దర్నీ కూర్చోబెట్టి సయోధ్య కుదర్చడంతో రాజీ పడటం తెలిసిన విషయాలే. అయితే.. సయోధ్య ఎంతోకాలం నిలవలేదు. ఎన్నికలు వచ్చేసరికి ఇద్దరూ వేరు పడ్డారు.

'మా' (1993లో) ఏర్పడ్డాక మొదటి రెండు దఫాలు ఎన్నికలు జరగలేదు. 'మా' కళాకారులు ఏకగ్రీవంగా అధ్యక్షులను ఎన్నుకున్నారు. తర్వాత ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నది శివాజీరాజాను మాత్రమే. శివాజీరాజాకు ముందు రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన జయసుధపై పోటీ చేసి గెలిచారు. అప్పట్లో ఒకరి ప్యానల్ సభ్యులపై మరొక ప్యానల్ సభ్యులు దుర్మార్గులు, దుష్టులు అని తిట్టుకున్నారు. తరవాత కళాకారులు అందరూ కూర్చుని 'మా'లో కుర్చీలాట వద్దనుకుని శివాజీరాజాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పట్లో ఎవరైనా ఒక్కసారి మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టాలని, తరవాత మరొకరికి అవకాశం ఇవ్వాలని ఒప్పందం కుదిరిందట. కానీ, ఆ ఒప్పందాన్ని ఎవరూ పాటిస్తున్నట్టు కనిపించడం లేదు.

రాజేంద్రప్రసాద్, జయసుధ పోటీ పడిన సమయంలో ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఈసారి అటువంటి తిట్ల దండకానికి దూరంగా హుందాగా ప్రచారం సాగుతోంది. అందులోనూ పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్నారు. "మా మనవరాలి మీద ఒట్టు. మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టను. 'మా'కి సొంత భవనం, ఓల్డేజ్ హోమ్ కట్టించి తప్పుకుంటా" అని శివాజీరాజా అన్నారు. దీనిపై నరేష్ సెటైర్స్ వేశారు. మేనిఫెస్టో విడుదల చేసే సమయంలో "నేను ఎవరి మీద  ఓట్లు వేయను" అని నరేష్ అన్నారు. అలాగే, "తల్లిదండ్రులను ఆదరించుకుందాం.. 'మా' అమ్మను రక్షించుకుందాం" అని నరేష్ ప్యానల్ ఒక స్లోగన్ అందుకుంది. గతంలో శివాజీరాజా తల్లిదండ్రులు తమ కొడుకు తమను ఆదరించడం లేదని మీడియా ముందుకొచ్చి ఆరోపణలు చేసిన సంగతిని అందరికీ గుర్తుచేసే ఉద్దేశమే ఈ స్లోగన్ అని టాక్. శివాజీరాజా, నరేష్ ఇద్దరూ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారనేది మెగా మద్దతుపై ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

రాజేంద్రప్రసాద్, జయసుధ పోటీ పడిన సమయంలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు రాజేంద్రప్రసాద్ ప్యానల్ కు ప్రత్యక్షంగా మద్దతు తెలిపారు. అప్పట్లో రాజేంద్రప్రసాద్ విజయం సాధించారు. ఇప్పుడు కూడా మెగా ఫ్యామిలీ ప్రభావం ఎన్నికల్లో ఉంటుందని చెప్పడానికి ఉదాహరణ... "ఓ వర్గానికి చిరంజీవి మద్దతు ఇస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. మేం కూడా చిరంజీవిగారిని కలిశాం. అందరూ కళామతల్లి బిడ్డలే. ఎవరు విజయం సాధించినా నా మద్దతు ఉంటుంది" అని జీవితా రాజశేఖర్ చెప్పడమే. చిరంజీవి ఫ్యామిలీ మద్దతు ఎవరికి ఉంటుంది? ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు? అనేది ఉత్కంఠగా మారింది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.