'మా'... మెగా కాంపౌండ్ కంచుకోట!
on Mar 11, 2019
'మా'లో మెగా మాటే చెల్లుబాటు అవుతుందని చెప్పడానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నరేష్ విజయం ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నరేష్ మెగా మంత్రం జపించడంతో అనూహ్యంగా భారీ ఆధిక్యంతో విజయం సాధించారని, ఆయన గెలుపు వెనుక మెగా మంత్రాంగం ఉందని ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, నటుడు, నిర్మాత నాగబాబు మీడియా ముందుకొచ్చి మరీ నరేష్ ప్యానల్ కి మద్దతు ప్రకటించిన విషయాన్ని అందరూ గుర్తు చేస్తున్నారు.
ఒక్కసారి 2015లోకి వెళితే... 'మా' అధ్యక్ష పదవికి రాజేంద్ర ప్రసాద్, జయసుధ పోటీపడ్డారు. అప్పట్లో ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఆ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ నట కిరీటి రాజేంద్రుడికి మద్దతు పలికింది. నాగబాబు నేరుగా రాజేంద్రప్రసాద్ తరపున ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అప్పట్లో జయసుధ వర్గం నుంచి నరేష్ పోటీ చేశారు. తరవాత 2017లో 'మా' ఎన్నికలు జరగలేదు. తాజా మాజీ అధ్యక్షుడు శివాజీరాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీని వెనుక మెగా మంత్రాంగం ఉందని అప్పట్లో వినిపించింది.
శివాజీరాజా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో కొన్ని సమస్యలు వచ్చాయి. వాటిలో శ్రీరెడ్డి సమస్య ముఖ్యమైనది. ఆమె నేరుగా పవన్ కల్యాణ్ పై, మెగా ఫ్యామిలీపై విమర్శలు చేసింది. టీవీ చానళ్లు ఆమెకు ప్రచారం కల్పించడంతో మరింత రెచ్చిపోయి బూతులు తిట్టింది. అలాగే, చిరంజీవి 'మా' కోసం అమెరికా వెళ్లి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంట్లో శివాజీరాజా అవకతవకలకు పాల్పడ్డారని నరేష్ ఆరోపించారు. తరవాత మెగాస్టార్, మిగతా పెద్దలు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. అయితే... శివాజీరాజాపై మెగా ఫ్యామిలీ ఆగ్రహంతో ఉన్నట్టు ఎక్కడా వార్తలు రాలేదు. ఎన్నికలకు ముందు శివాజీరాజా, నరేష్ ప్యానల్స్ ఆయన్ను కలిశాయి. ఎవరు విజయం సాధించినా తన మద్దతు ఉంటుందని చిరంజీవి తెలివిగా చెప్పారు. అయితే... శివాజీరాజాకు చిరంజీవి మద్దతు ఉందని ప్రచారం జరిగింది. వీటిని జీవితా రాజశేఖర్ ఖండించారు. తరవాత రెండు రోజులకు నరేష్, జీవితా రాజశేఖర్ ప్యానల్ కు మద్దతుగా నాగబాబు ప్రెస్ మీట్ పెట్టారు. హోరా హోరీగా, గట్టి పోటీ నడుమ జరుగుతాయని అనుకున్న ఎన్నికలు కాస్తా ఏకపక్షంగా మారాయి. నరేష్ ప్యానల్ ముఖ్యమైన పదవుల్ని కైవసం చేసుకుంది.
నరేష్, జీవితా రాజశేఖర్ ప్యానల్ కి నాగబాబు మద్దతు తెలపడం వెనుక మెగాస్టార్ ఉన్నారని టాక్. ఎన్నికలకు ముందు చిరంజీవికి మహేష్ నుంచి స్వయంగా ఫోన్ వెళ్లిందట. నరేష్ కి మద్దతు ఇవ్వమని చిరంజీవిని మహేష్ కోరారట. అప్పటికి చిరంజీవిని కలిసిన నరేష్, జీవితా రాజశేఖర్ తదితరులు తమకు మద్దతు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. 'మా'లో సమస్యలు, మహేష్ ఫోన్.. వగైరా, వగైరా లెక్కలు వేసుకున్న మెగా ఫ్యామిలీ నరేష్ కి మద్దతు ఇచ్చింది. ఆయన విజయం సాధించారు. ఇకపై 'మా'లో పదవులు కావాలని కోరుకునేవారు మెగా మంత్రం జపిస్తే పని సులభంగా అవుతుందన్నమాట.