టీజర్, ట్రైలర్ లో కంటెంట్ నచ్చితేనే నా సినిమాకు రండి
on Mar 2, 2022
రూరల్ బ్యాక్ డ్రాప్ లో నైట్ బ్లైండ్‌నెస్(రేచీకటి) నేపథ్యం లోని కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కామెడీ థ్రిల్లర్ 'సెబాస్టియన్ PC 524'. 'రాజావారు రాణి గారు', 'యస్. ఆర్.కళ్యాణమండపం' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కిరణ్ ఆబ్బవరం నటించిన మూడో సినిమా ఇది. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై బి . సిద్దారెడ్డి నిర్మించిన ఈ సినిమాతో బాలాజీ సయ్యపురెడ్డిని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా మార్చి 4న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు వెంకీ కుడుముల, వేణు శ్రీరామ్, సీనియర్ నటుడు సాయి కుమార్, హీరోలు అడవి శేష్ ,ఆకాష్ పూరి, సప్తగిరి తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
అడవి శేష్ మాట్లాడుతూ.. "కిరణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఫంక్షన్ కు నేను కిరణ్ అభిమానిగా వచ్చాను. ఎందుకంటే కిరణ్ 1991 షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ చూసినపుడు ఇలాంటి సినిమా నేను చెయ్యాలి అనుకున్నాను. లాస్ట్ ఇయర్ నైట్ బ్లైండ్‌నెస్ మీద మంచి స్క్రిప్ట్ విన్నాను. ఇది బాగుందే ఇలాంటి కథ ను ఎవ్వరూ చేయలేదు అని మా ఫ్రెండ్స్ తో చెప్పినప్పుడు ఇలాంటి కథను కిరణ్ చేస్తున్నాడు అని చెప్పారు. ఎవరూ చెయ్యని విభిన్న కథలను నేను చెయ్యాలి అనుకున్నపుడు తను చేయడం చూసి కిరణ్ పై ఇష్టం ఏర్పడింది. మంచి టీం తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప హిట్ అవ్వాలని కోరుతున్నాను" అన్నారు.
హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ.. "కిరణ్ పెరఫార్మెన్స్ అంటే నాకు చాలా ఇష్టం. తమిళ్ లో శివకార్తికేయన్ ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఈ రోజు పెద్ద స్టార్ అయ్యాడు. కిరణ్ కూడా తనలా బిగ్ స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ నెల 4 న వస్తున్న ఈ సినిమా కిరణ్ కు, దర్శక, నిర్మాతలకు, చిత్ర యూనిట్ కు మంచి పేరు రావాలని మనస్పూర్తిగా కోరుతున్నాను" అన్నారు
చిత్ర దర్శకుడు బాలాజీ సయ్యపురెడ్డి మాట్లాడుతూ.. "కిరణ్ కు ఈ కథను 2019లో చెప్పడం జరిగింది. కథను చెప్పిన వెంటనే కథ బాగుందని ఈ సినిమా చేద్దామన్నాడు. అంతకుముందు ఈ కథను చాలా మందికి చెప్పాను. అందరూ కూడ కథను మార్పులు చేయమని చెప్పారు. అయితే కిరణ్ మాత్రం ఒక్క చేంజ్ లేకుండా కథను ఒకే చేశాడు. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా చూస్తున్న మీకు సినిమాలో కిరణ్ కనిపించడు 'సెబాస్టియన్' మాత్రమే కనిపించేలా అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన కిరణ్ కు, నిర్మాతలకు ధన్యవాదాలు" అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. "మన ఇంటికి ఒక గెస్ట్ వస్తే వారిని ఎంతో బాగా చూసుకుంటాం. అలాంటింది మన కోసం థియేటర్స్ కు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి సినిమా చూసే ప్రేక్షకులను నిరాశ పరచకూడదని చక్కటి కథను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా చూసిన తరువాత ప్రేక్షకులందరూ కూడా చాలా మంచి సినిమా చేశారని మెచ్చుకుంటారు. రాజు, ప్రమోద్ అన్నలు మా సిద్దారెడ్డి మామ నాకెంతో సపోర్ట్ గా నిలిచారు. నాకు సినిమా అంటే ప్రాణం. దానిని మా అన్న గుర్తించాడు. ఎక్కడో ఊర్లో టికెట్ కొనుక్కొని సినిమా చూసే నన్ను ఈ రోజు హీరోను చేశాడు. తను ఈ రోజు మా మధ్య లేనందుకు చాలా బాధగా ఉంది. తను కోరుకున్న విధంగానే నేను ఇంకా ఎక్కువగా కష్టపడి మంచి సినిమాలు చేస్తాను. ప్రతి ఒక్కరికీ నేను చెప్పేది ఒక్కటే నేను తీసే ఏ సినిమా అయినా టీజర్, ట్రైలర్ లో కంటెంట్ నచ్చితేనే సినిమాకు రండి. ఇప్పుడు చేసిన సెబాస్టియన్ కూడా అందరికీ తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను" అన్నారు.
Also Read