క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానికి అండగా ఎన్టీఆర్...
on Sep 15, 2024
అభిమానులను సొంత మనుషుల్లా భావించే అతి కొద్దిమంది హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకరు. అభిమాని కష్టాలలో ఉన్నట్లు తెలిస్తే చాలు ఎన్టీఆర్ వెంటనే స్పందిస్తారు. తాజాగా క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానితో మాట్లాడి తాను ఉన్నానన్న భరోసాను ఇచ్చారు.
తిరుపతికి చెందిన కౌశిక్ (19) ఎన్టీఆర్ కు వీరాభిమాని. అతను 2022 నుంచి బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని కిడ్ వై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఎన్టీఆర్ నటించిన 'దేవర' చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుండగా.. ఆ సినిమా చూసే వరకైనా తనను బతికించాలని, ఇదే తన చివరి కోరిక అని.. డాక్టర్లకు, తల్లిదండ్రులకు కౌశిక్ చెప్పాడు.
కౌశిక్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఎన్టీఆర్.. వీడియో కాల్ చేసి అతనితో మాట్లాడారు. "సినిమా సంగతి తర్వాత.. ముందు నువ్వు కోలుకో. కోలుకున్నాక నీతో కలిసి నేను సినిమా చూస్తాను. ధైర్యంగా ఉండు.. ఏం కాదు" అని ఎన్టీఆర్ అనడంతో.. కౌశిక్ ఆనందభాష్పలతో "థాంక్యూ అన్న.. నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను.. నేను ధైర్యంగా ఉంటాను.. మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పన్నా" అన్నాడు. కౌశిక్ తల్లితో కూడా మాట్లాడిన ఎన్టీఆర్.. "మీ అబ్బాయి లాగా మీరు కూడా ధైర్యంగా ఉండండి.. అప్పుడు ఇంకా త్వరగా కోలుకుంటాడని" అన్నాడు. ఆ మాటలకు కౌశిక్ తల్లి ఎమోషనల్ అవుతూ.. "అలాగే చికిత్సకు కూడా ఆర్థికంగా సాయం చేయాలి" అని కోరగా.. "అదంతా మేము చూసుకుంటాం అమ్మా.. ఆల్రెడీ టీమ్ తో మాట్లాడాను." అని ఎన్టీఆర్ చెప్పారు.