ఎన్టీఆర్ బావమరిది ప్లానింగ్ మామూలుగా లేదు!
on Aug 16, 2024
స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలు.. మొదటి సినిమా నుంచే తమని తాము మాస్ హీరోగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. భారీ ఇంట్రడక్షన్ లు, ఫైట్లు, పాటలతో ఎలాగైనా స్టార్ అవ్వాలని తపిస్తుంటారు. ఈ క్రమంలో చేతులు కాల్చుకొని మొదటికే మోసం వచ్చి, కనీసం సాధారణ హీరోగా కూడా నిలబడలేకపోతారు. అందుకేనేమో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) బావమరిది నార్నే నితిన్ (Narne Nithin) కాస్త భిన్నంగా అడుగులు వేస్తున్నాడు.
టాలీవుడ్ లో ఉన్న బడా స్టార్స్ లో ఎన్టీఆర్ ఒకరు. ఆయన బావమరిది హీరోగా పరిచయమవుతున్నాడంటే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి. ఇక ఒక భారీ కమర్షియల్ సినిమాతో అతనిని హీరోగా పరిచయం చేస్తూ, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తే ఆ అంచనాలు ఓ రేంజ్ కి వెళ్తాయి. అయితే ఒకవేళ ఆ అంచనాలను అందుకోలేకపోతే మాత్రం.. హీరోగా నిలదొక్కుకోవడం కష్టమవుతుంది. ఈ విషయాన్ని గ్రహించే నార్నే నితిన్ తెలివిగా అడుగులు వేస్తున్నట్టున్నాడు.
తాను హీరోని, తన చుట్టూనే కథ తిరగాలి, తనకి ఎలివేషన్లు ఉండాలి వంటి అనవసరమైన పోకడలకు పోకుండా.. ఒక మంచి కథలో, ఒక మంచి సినిమాలో తను భాగమైతే చాలు అన్నట్టుగా నార్నే నితిన్ అడుగులు వేస్తున్నాడు. దానికి ఉదాహరణగా అతను హీరోగా విడుదలైన మొదటి సినిమా 'మ్యాడ్'ని చెప్పుకోవచ్చు. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ మూవీలో.. నితిన్ రోల్ సినిమాలో భాగంగా ఉంటుంది కానీ, అతనే హీరో అనేలా కథ నడవదు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఇక ఇప్పుడు నితిన్ హీరోగా రెండో సినిమా 'ఆయ్' (Aay) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కూడా అనవసరమైన హీరోయిజం జోలికి పోకుండా, కథలో భాగంగానే అతని పాత్ర ఉంటుంది. ఈ సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ చిత్రంతో మరో ఘన విజయాన్ని నితిన్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయమైంది. ఇలా సినిమాల ఎంపిక విషయంలో తెలివిగా అడుగులు వేస్తూ.. వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటున్న నార్నే నితిన్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇలాగే బలమైన పునాదితో.. సినిమా సినిమాకి తనని తాను మెరుగుపరుచుకుంటూ భవిష్యత్ లో మంచి హీరోగా పేరు తెచ్చుకుంటాడేమో చూడాలి.
Also Read