రొమాన్స్ హద్దుల్లో ఉండాలి!
on Jul 3, 2019
‘‘ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నేను జోక్యం చేసుకున్నానని వచ్చిన వార్తలు సరికాదు. నేనెందుకు జోక్యం చేసుకుంటారు? పదికోట్లమందికి సినిమా నచ్చాలని తీస్తాం. వాళ్ల కంటే ముందు యూనిట్లో పదిమందికీ నచ్చాలి కదా! కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. సినిమా బాగా రావడానికి కృషి చేస్తాం. సలహాలు ఇస్తానంతే! కానీ, జోక్యం చేసుకోను. నాకు దర్శకత్వం చేయాలనుంటే... మరొకరికి ఛాన్స్ ఎందుకిస్తా? నేనే చేస్తా’’ అని జీవితా రాజశేఖర్ అన్నారు. రాజశేఖర్ హీరోగా నటించిన 'కల్కి' దర్శకత్వ బాధ్యతల్లో తాను జోక్యం చేసుకున్నానని వచ్చిన పుకార్లపై ఆమె స్పందించారు. అలాగే, ప్రస్తుతం వస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ ‘‘రొమాన్స్ వద్దని చెప్పడం లేదు కానీ... కుటుంబంతో కలిసి చూడాలంటే ఇబ్బందిపడేలా రొమాంటిక్ సీన్స్ వద్దని చెబుతున్నా. సెన్సార్ బోర్డ్ సభ్యురాలిగా కొన్ని సినిమాలు చూస్తుంటే ఎలా స్పందించాలో తెలియడం లేదు. నేను హీరోయిన్గా చేశా. నా పిల్లలు హీరోయిన్లుగా చేస్తున్నారు. అవసరమైన చోట రొమాన్స్ ఉండటం తప్పు కాదు. కె. విశ్వనాథ్, బాపు, మణిరత్నం వంటి దర్శకులు అసభ్యత లేకుండా రొమాంటిక్ సీన్స్ తీశారు. కొందరు మరీ మితిమీరి చూపిస్తున్నారు’’ అన్నారు.