తెలుగు తెర మరపురాని మహానటుడు ఎస్వీ రంగారావు
on Jul 2, 2015
ఘటోత్కచుడు, కీచకుడు, రావణాసురుడు, హిరణ్యకశిపుడు ఈ పాత్రలు తలుచుకోగానే నిలువెత్తు రూపం కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. నటయశస్వి, నటనా సామ్రాట్, విశ్వనట చక్రవర్తి ఇవన్నీ నటనా ప్రపంచలో ఆయనకొచ్చిన బిరుదు. తల్లిదండ్రులు పెట్టిన పేరు మాత్రం సామర్ల వెంకట రంగారావు నాయుడు.
జూలై 3వ 1918లో కృష్ణాజిల్లా నూజివీడులో జన్మించారు నట యశస్విగా పేరు పొందిన ఎస్వీ రంగారావు. శ్రీకోటేశ్వరనాయుడు- శ్రీమతిలక్ష్మీనరసాయమ్మ తల్లిదండ్రులు. బీఎస్సీ పట్టాపుచ్చుకున్నాక నటనపై ఎనలేని మక్కువతో రంగస్థల ప్రవేశం చేశారు. షేక్స్పియర్ నాటకాలు ఎన్నో వేశారు. మంచి నటుడిగా గుర్తింపు రాగానే సినిమాల్లో అవకాశాలకోసం మద్రాసు బాటపట్టారు. 1946లోవరూధిని చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. కానీ ఆ చిత్రం ఫ్లాప్ అవడంతో చాలా నిరాశపడ్డారు. రెండేళ్ల పాటు సినిమాల వైపు అడుగేయలేదు. 1948 లో మళ్లీ మద్రాసు వెళ్లిన ఆయన అవకాశాల కోసం అహర్నిశలు శ్రమించారు.మద్రాసులోఎక్కని, దిగని గడపలేదు. వెళ్లని స్టూడియోలేదు. అయినా నిరుత్సాహపడలేదు. ఒక్క అవకాశం చాలు తన సత్తాచాటుకునేందుకు అని ధైర్యంగా అడుగేశారు.
మొత్తానికి 1950లో పల్లెటూరిపిల్లలో చిన్నవేషం దొరికింది. అక్కడినుంచి నటనలో విజృంభించారు ఎస్వీఆర్. సాంఘిక పాత్రలతోపాటు పౌరాణిక పాత్రలు వేయడంలో ఆయనకు ఆయనేసాటి. నిండైన విగ్రహం, మంచివాచకం, పాత్రకు తగిన అభినయం ఇవన్నీ సాటిలేని నటుడిగా నిలబెట్టాయి. ఖంగుమని మోగే కంఠం, కన్నులతోనే అలవోకగా పలికించే భావాలు నటనకు కొత్త భాష్యాన్నిచెప్పాయి. భారీడైలాగుల్నికూడా గుక్కతిప్పుకోకుండా చెప్పగల ప్రజ్ఞాశీలి ఎస్వీఆర్. 1951లో పాతాళభైరవిలో మళయాళ మాంత్రికుడిగా ఆయన నటన నభూతోనభవిష్యతి. ‘జైపాతాళభైరవి.. సాహసం శాయరా ఢింబకా..అంటూ చెప్పే డైలాగ్ ఇప్పటికీ జనాల నోట్లో నానుతూనే ఉంటుంది. ఆయన తన నటనతో అంత ప్రభావితం చేశాడు మరి. దుష్ట పాత్రల్లోఆయన చూపిన అభినయం ఒకెత్తైతే.. శిష్ట పాత్రల్లో ఎస్వీఆర్ ఒలికించిన లాలిత్యం మాటల్లో వర్ణించలేం.
ఎస్వీఆర్ ధరించే పాత్ర ఏదైనా హీరోతోనే కాదు...కథతో సైతం పోటీపడేది. రావణాసురుడు, కంసుడు, కీచకుడు,దుర్యోధనుడు ఇవన్నీ ఉదాహరణలు. అంతేకాదు మాయాబజార్ లో ఘటోత్కచుడు, భక్తప్రహ్లాదలో హిరణ్యకశిపుడి పాత్రల్లో ఆయనకు ఆయనే సాటి. పౌరాణికమే కాకుండా హాస్యరస చిత్రాల్లోనూ తనబాణి పలికించారు. బ్రతుకుతెరువు, అప్పుచేసిపప్పుకూడు, మిస్సమ్మ, తోడికోడళ్లు వంటి హాస్య చిత్రాలు ఈ కోవకేచెందుతాయి. ఎస్వీఆర్ రెండు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిన చిత్రం ‘బంగారు పాప’. ఇంకా తాత- మనమడు, షావుకారు, పాతాళభైరవి, పెళ్ళిచేసిచూడు, గుండమ్మకథ లాంటి కుటుంబ కథాచిత్రాల్లో ఆయన ప్రతిభ అసమానం. నర్తనశాలలో కీచకుడి పాత్రలో జీవించిన ఎస్వీఆర్ ను పేరు ప్రఖ్యాతులు వెతుక్కుంటూ వచ్చాయి. ఈ సినిమాకు జకార్తాలో జరిగిన ఆఫ్రోఆసియన్‌ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమనటుడి పురస్కారం వరించింది.
విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటశేఖర, నటసింహ లాంటిఎన్నోబిరుదుల్నిఆయన పొందారు. భయానకం, వీరం, రౌద్రం, కరుణం, శృంగారం, హాస్యం, శాంతం, బీభత్సం, అద్భుతం ఇలా నవరసాలు ఆయన నరనరాల్లో జీర్ణించుకు పోయాయి. బొబ్బిలి తాండ్రపాపయ్య అచ్చంగా ఇలాగే ఉంటాడేమో అనుకున్న జనం బొబ్బిలియుద్ధం సినిమాలోఆయన నటనకు నీరాజనాలు పట్టారు. పాత్ర ఏదైనా అందులోపూర్తిగా ఒదిగిపోయి పరిపూర్ణత్వాన్నికలిగించిన మహా నటుడు ఎస్వీరంగారావు. అయినా ఆయన నటనకు సరితూగే పురస్కారాలు లేవంటే అతిశయోక్తి కాదు. కాదు కూడదు ఇవ్వాలంటే కొత్త అవార్డులేమైనా సృష్టించాలేమో.
వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి. ఆయన ఇష్టదైవం శివుడు. ప్రతిరోజూ శివపూజ చేసిన తర్వాతే దినచర్య ప్రారంభించే వాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆయన ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నోఉండేవి. ఆయన గొప్ప దాత. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్నివిరాళాలు ఇచ్చారు. చైనాతోయుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలోపదివేల రూపాయలు విరాళం ఇచ్చారు. పాకిస్తాన్‌తోయుద్ధం వచ్చినపుడు కూడా ఎన్నోసభలు నిర్వహించి, మిగతా నటులతోకలసిఎన్నోప్రదర్శనలు ఇచ్చి, విరాళాలు సేకరించి, ఆ డబ్బును దేశ రక్షణ నిధికి ఇచ్చిన గొప్ప మనస్కుడు. తెలుగువారు గర్వింప తగ్గ మహానటుడు ఆయన. ఒక్కమాటలో చెప్పాలంటే నాటి మేటి హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు ధీటుగా నిలబడిన విలక్షణ నటుడాయన. సినిమాల్లో రకరకాల పాత్రల్లో మెప్పించిన ఆయనకు వివేకానందుడి జీవితాన్న సినిమా తీయాలన్న బలీయమైన కోరిక నెరవేరనేలేదు.
తెలుగు సినిమా ఉన్నంత వరకూ మరపురాని ఈ మహానటుడు జులై 18, 1974 లో తుదిశ్వాశ విడిచినా..ఆయన రూపం ఎప్పటికీ కళ్లముందే ఉంటుంది. ఆయన డైలాగ్స్ చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. తెలుగు సినిమా ఉన్నంత వరకూ ఎస్వీఆర్ కు మరణం లేదు. ఉండదు.