పూరి జగన్నాథ్... మేడ్ ఫర్ కమర్షియల్ సి
on Sep 28, 2014
పూరి జగన్నాథ్ అంటే ఏమిటి?
పూరి అంటే పదిహేనేళ్లలో ఇరవై అయిదు సినిమాలు తీసిన స్పీడు మాత్రమే కాదు..
పూరి అంటే బ్లక్ బ్లస్టర్ హిట్టు మాత్రమే కాదు...
పూరి అంటే కమర్షియల్ సినిమాకి కేరాఫ్‌మాత్రమే కాదు..
పూరి అంటే.. అంతు లేని విశ్వాసం.. పూరి స్టైల్‌లో చెప్పాలంటే - ఓటమికి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా స్ట్రోక్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్నోడు.
సినిమా అంటే పిచ్చి. సినిమాని శ్వాసిస్తాడు... తనదైన రోజున శాసిస్తాడు. పగలు, రాత్రి, పనిలోనూ, నిద్రలోనూ ఒకటే కల.. సినిమా.
పూరి ఇంట్లో ఓ కొటేషన్ వేలాడుతూ ఉంటుంది..
''నాకు రెండ్రో బ్లూస్లీలా గుర్తింపు తెచ్చుకోవాలని లేదు.. మొదటి జాకీచాన్‌లా మిగిలిపోవాలని ఉంది..''
- జాకీచాన్.
పూరి కూడా అచ్చంగా ఇలానే అనుకొన్నాడు. ఓ రాఘవేంద్రరావులానో, దాసరి లానో సినిమా తీయాలనుకోలేదు. రెండో వర్మనో, మూడో కోదండరామిరెడ్డినో అనిపించుకోవాలని రాలేదు. మొదటి పూరిలా పేరు తెచ్చుకొందామనుకొన్నాడు. తనదంటూ ఓ స్టైల్ జోడించి... ''ఇది పూరి సినిమా'' అంటూ ఓ జెండా రెపరెపలాడేలా చేద్దామనుకొన్నాడు.. చేశాడు. అందుకోసం తను ఎంచుకొన్న విధానం.. హీరోయిజం. యస్... అంత వరకూ మనం చూసిన హీరో వేరు. పూరి సినిమాలో హీరో వేరు. కొండంత ధైర్యం, చెప్పలేనంత విశ్వాసం, అంతులేనంత ఎనర్జీ... వీటికి రూపం ఇస్తే పూరి సినిమాలోని హీరో తయారైపోతాడు. ఇవి ఎక్కడి నుంచో సృష్టించుకొన్న లక్షణాలు కావు. స్వతహాగా తనలో ఉన్నవే. తన పాత్రలకు ఆపాదించాడంతే...నువ్ నందా అయితే నేను బద్రి... బద్రినాథ్ అంటూ పవన్ కల్యాణ్ మెడ దగ్గర రుద్దుకొనే సీన్ - పూరి తాలుకు ఎమోషన్‌ని బయటపెడుతుంది..
సిటీకి ఎంతోమంది కమీషన్లు వస్తుంటారు, పోతుంటారు.. చంటిగాడు లోకల్.... అని కమీషనర్‌కే సవాలు విసిరే తెగువలో.. పూరిలోని ధైర్యం కనిపిస్తుంది.
పైసా సంపాదించలేని ఏ వెధవకీ ప్రేమించే అర్హత లేదంటూ తేల్చిచెప్పిన సిద్ధాంతంలో.. పూరిలోని వ్యక్తిత్వం దర్శనమిస్తుంది.
పూరి సినిమాల్లోని హీరో ఎమోషనల్లీ స్ట్రాంగ్... పూరీ కూడా అంతే.
పూరి సినిమాల్లోని హీరో సెంటిమెంటల్లీ కాస్త వీక్....పూరి కూడా అంతే.
బద్రి సినిమా తీస్తుంటే.. ఆ స్పీడు చూసి నిర్మాత త్రివిక్రమరావు.. `నువు అతి తొందరల్లోనే పాతిక సినిమాలు తీసేస్తావ్` అన్నారట. ఆయన అన్నమాట అక్షరాలా నిజం అయ్యింది. హార్ట్ ఎటాక్‌తో పాతిక పూర్తి చేశాడు పూరి. అగ్ర దర్శకులంతా యేడాదికి ఒకటి, రెండోళ్లకు ఒకటి అంటూ సరిపుచ్చుకొంటుంటే... పూరి స్పీడు స్పీడుగా సినిమాలు తీసేశాడు. కొండల్ని పిండిచేసే హీరోయిజం చూడాలంటే... పూరి సినిమాకి వెళ్లాలి. హీరోయిన్లనేం తక్కవ చేయలేదు. ప్రతీ సినిమాలోనూ ఆ పాత్రకీ ఓ ఔచిత్యం ఉంటుంది. పూరి బలం.. అతని డైలాగులు. ప్రతీ డైలాగులోనూ ఓ రెక్లెస్‌నెస్ ఉంటుంది. కానీ కాస్త లోతుగా వెళ్లగలిగితే.. వాటి మాటున ఓ బాధ్యత ఉంటుంది. పూరి పుస్తకాల పురుగు. చలం, శ్రీశ్రీ, విశ్వనాథ, ముళ్లపూడి... ఇలా అందర్నీ చదివేశాడు. ప్రాశ్చాత్య సాహిత్యం కూడా ఒంటబట్టించుకొన్నాడు. అందుకే డైలాగుల్లో ఆ పదును తెలుస్తుంటుంది.
సినిమా పేర్లు కూడా.. కాస్త పొయెటిక్‌గా ఉంటాయి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి.... ఇలా పూరి మార్క్ టైటిల్‌తోనే మొదలైపోతుంటుంది.
పూరి జీవితంలో డబ్బు వచ్చింది.. వెళ్లింది... మళ్లీ వచ్చింది.
హిట్స్ వచ్చాయి... వెళ్లాయి... మళ్లీ వచ్చాయి..
కానీ పూరి మాత్రం అలానే ఉన్నాడు. కష్టాల విలువ తెలుసినోడు పూరి. సుఖాల చిరునామా కూడా తెలుసుకోగలిగాడు. అందుకే విలాస పురుషుడయ్యాడు. జీవితాన్ని పూరి ఎంజాయ్ చేసినట్టుగా మరో దర్శకుడు చేయలేదేమో. ఈ డబ్బులన్నీ వెళ్లిపోతాయేమో, నా పరపతి నాకు కాకుండా పోతుందేమో, నా ప్రస్థానం ఇక్కడితో పుల్‌స్టాప్ పడిపోతుందేమో... ఇలాంటి భయల్లేవ్ పూరీకి. ఎందుకంటే... జీరో నుంచి ఆట మొదలుపెట్టడంలోని మజా.. తనకు బాగా తెలుసు. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకొన్న పూరి.. ఒకప్పుడు దివాళా తీసి చేతిలో చిల్లిగవ్వకూడా మిగుల్చుకోని పూరి... ఇప్పుడు మళ్లీ నిలబడి.. `ఐ యామ్ బ్యాక్` అని పించుకొన్నాడంటే.. అదీ అతనికున్న గట్స్.
బద్రి, ఇడియట్, దేశముదురు, పోకిరి, బుజ్జిగాడు.. ఈ హిట్స్‌తో పూరి విజయాల్ని కొలవలేం.
బాచి, ఆంధ్రావాలా, కెమెరా మెన్ గంగతో... ఈ ఫ్లాప్స్‌తో పూరిని తక్కువ చేయలేం.
ఎందుకంటే పూరి ఓ డైమండ్... మసి పూసినా కొద్దిసేపే. ఆ మెరుపుల్ని ఎవ్వరూ ఆపలేరు. బై బర్త్ టాలెంట్ ఉంది.. దాన్ని చూపించే వేదిక ఉంది.. సినిమాలు వస్తుంటాయ్, పోతుంటాయ్.. టాలెంట్ శాశ్వతం. అది మళ్లీ మళ్లీ నిరూపించుకొనే సత్తా పూరిలో ఇంకా ఇంకా ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ఓ సినిమా తీస్తున్నాడు. అది హిట్టయితే సినిమా తీస్తాడు. ఆఖరికి ఫ్లాప్ అయినా మళ్లీ మరో సినిమా తీస్తాడు..
నేనింతేలో ఓ డైలాగ్ ఉంది.
సినిమా హిట్టయిందని ఆగిపోం. ఫ్లాప్ అయిందని తీయడం మానేం. తీస్తూనే ఉంటాం. ఎందుకంటే మనకు తెలిసింది ఒక్కటే.
సినిమా... సినిమా.. సినిమా.
పూరి డైలాగ్ కూడా ఇదే.