పవన్ కల్యాణ్‌కు ఏలే అవకాశం రావాలని కోరుకుంటున్నా!
on Oct 4, 2022
ఆంధ్రప్రదేశ్‌ను ఏలే అవకాశం తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు రావాలని కోరుకుంటున్నానని మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడు లాంటి నిబద్ధత ఉన్న నాయకులు మనకు రావాలని ఆయన అన్నారు. చిరంజీవి లేటెస్ట్ ఫిల్మ్ 'గాడ్‌ఫాదర్'.. దసరా పర్వదినం సందర్భంగా రేపు (అక్టోబర్ 5) విడుదలవుతోంది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ విషయం ప్రస్తావనకు రాగా, మొదట తడబడిన ఆయన, తర్వాత స్పష్టంగా తన మద్దతు తమ్ముడికి ఉంటుందని చెప్పేశారు.
"నేను పాలిటిక్స్ నుంచి ఎగ్జిట్ అయ్యి, సైలెంట్‌గా ఉండటమే ఇప్పుడు మా తమ్ముడికది హెల్ప్ అవుతుందేమో అని అన్నానా, ఏమో తెలీదు నాకు. కాబట్టి నా మద్దతు నా తమ్ముడికే అన్నది స్ట్రాంగ్‌గా మాత్రం నేను చెయ్యలేదండీ. May be future లో ఏమో తెలీదు." అని మొదట కాస్త తడబడుతూ చెప్పారు. ఆ తర్వాత ఆయన పవన్‌ను ఉద్దేశించి, "వాడు నా తమ్ముడు" అనగానే ఈలలు గట్టిగా వినిపించాయి. దాంతో చిరు కాస్త ఉద్వేగానికి గురైనట్లు, ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.
"నా తమ్ముడికి.. తన నిబద్ధత, తన నిజాయితీ.. తన చిన్నప్పట్నుంచీ తెలుసు నాకు. అందులో ఎక్కడా కూడా పొల్యూట్ అవలేదు. అంతటి నిబద్ధత ఉన్నటువంటి నాయకులు మనకు రావాలి. వాళ్లు ఏ పక్షాన ఉంటారు, ఎటు ఉంటారు, ఎలా ఉంటారనేది భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారు. బట్.. అలాంటివాళ్లు రావాలనేది నా ఆకాంక్ష. దానికి డెఫినెట్‌గా నా సపోర్ట్ ఉంటుంది." అన్నారు చిరంజీవి.
"నేనో పక్కనా, తనో పక్కనా ఉండటం కంటే.. నేను విత్‌డ్రా చేసుకొని సైలెంట్ అయిపోవటం వల్లే.. తను ఎమర్జ్ అవుతాడు, ఫ్యూచర్‌లో బెస్ట్ నాయకుడవుతాడు.. ఏమో.. ఏలే అవకాశం ప్రజలు తనకిస్తారేమో అని భావిస్తాను. అలాంటి రోజు రావాలని కూడా కోరుకుంటున్నాను." అని ఆయన చెప్పుకొచ్చారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
