ఇంకా 'చిరు' సినిమాలేనా? 'మెగా' మూవీస్ చేయడా?
on Dec 19, 2016
బాస్ ఈజ్ బ్యాక్! ఇప్పుడు టాలీవుడ్లో ఈ మాట భీభత్సంగా వినిపిస్తోంది. హీరో చిరు పొలిటీషన్ అయ్యాడు. మళ్లీ ఇప్పుడు హీరోగా పునః ప్రత్యక్షమవుతున్నాడు! అందుకే, అభిమానులు బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. నిజంగా కూడా మెగాస్టార్ దశాబ్దాల తరబడి తెలుగు సినిమాకి బాసే! అందాల వెండితెర స్వర్గానికి ఇంద్రుడే! కాని, 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 చేస్తున్న ఆయన మీద కొంత మంది అసంతృప్తితో వున్నారు. అదీ చిరంజీవితో కలిసి టాలీవుడ్ టాప్ స్టాట్ ని పంచుకున్న మరో ఇద్దరు హీరోలు నాగ్, బాలయ్యలతో పోల్చీ మరి బాధపడుతున్నారు. అసలు చిరంజీవి విషయంలో కొందరు తెలుగు సినీ లవ్వర్స్ బాధేంటంటే...
చిరంజీవి ... తెలుగు వారి రజినీకాంత్! టాలీవుడ్ కి అమితాబ్ బచ్చన్! కమల్ హసన్ లాగా నటించగల సత్తా వున్న సల్మాన్ ఖాన్! ఇదీ చిరంజీవి స్పెషాలిటి! ఆయన ఎలాంటి సినిమా అయినా , ఎలాంటి పాత్రైనా చేయగలరు. ఇప్పటి వరకూ ఆయన 150 సినిమాల్లో ఎక్కడా ముఠా మేస్త్రీ యాక్టింగ్ కి పేరు పెట్టిన వారు లేరు. డ్యాన్స్ కు తిరుగులేదు. డైలాగ్ డెలివరీకి మారు మాట లేదు. ఏ విధంగా చూసినా చిరు రజినీ, కమల్, అమితాబ్, షారుఖ్, సల్మాన్... వీళ్లందరి కంటే గొప్ప! అందుక్కారణం ఆయనలోని అద్భుతమైన టాలెంటే!
చిరంజీవి ఎంతగా టాలెంటెడో అంతే ఇమేజ్ కి బందీ కూడా! ఖైదీ పేరుతో సినిమా చేసిన ఆయన తన ఇమేజ్ లోనే బందీ అయిపోయాడు. చాలా ఏళ్ల కిందటే స్వయంకృషి, ఆపద్భాంధవుడు, రుద్రవీణ లాంటి సినిమాలు చేసిన చిరు తరువాత మాత్రం ఫక్తు కమర్షియల్ సినిమాలకే పరిమితం అయిపోయాడు. చివరకు, పదేళ్ల పొలిటికల్ స్టంట్ తరువాత చేస్తోన్న 150వ సినిమా కూడా ఎలాంటి విశేషం లేకుండా రాబోతోంది! మరీ దారుణంగా, తమిళ రీమేక్ గా వస్తోంది. ఇక పాటలు కూడా అమ్మడు కుమ్ముడు అంటూ చిరంజీవి స్థాయికి తగని మాటలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి! ఇలాగానే బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వచ్చేది... అని మథన పడిపోతున్నారు మెగా ఫ్యాన్స్!
ఒకవైపు 150 చిత్రాల చిరు కమర్షియల్ మసాలాను నమ్ముకుంటే వంద సినిమాల బాలయ్య బాబు చారిత్రక సినిమా ఎన్నుకున్నాడు. గౌతమీ పుత్ర శాతకర్ణీ అంటూ ఓ కొత్త రిస్క్ భుజాన వేసుకున్నాడు. తెలుగు వారి రారాజుగా వందో సినిమాలో కనిపించటం ప్రమాదకరమే. ఏ మాత్రం తేడా వచ్చినా ప్లాప్ గా మిగిలిపోతుంది. కాని, యువరత్న క్రిష్ ను నమ్ముకుని బరిలోకి దిగాడు. అటు నాగ్ కూడా టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే స్పెషల్ మూవీ చేస్తున్నాడు. ఆల్రెడీ అన్నమయ్యగా ఆహా అనిపించిన మన్మథుడు ఈ సారి హథీరామ్ బాబాగా ఓం నమో వేంకటేశాయ అంటున్నాడు! మరి చిరంజీవి? ఖైదీ నెంబర్ 150 అంటూ సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నాడు! ఇదే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ని, మూవీ లవ్వర్స్ ని వేధిస్తున్న అంశం...
తనకున్న మాస్ ఇమేజ్ కోసం అనేక సార్లు కమర్షియల్ ఫార్ములాకి లోబడిపోయిన చిరంజీవి చరిత్రలో నిలిచిపోయే సినిమాలు పెద్దగా చేయలేదనే చెప్పాలి. ఈ 150వ సినిమా తరువాతైనా ఆయన ఒక అమితాబ్ బచ్చన్ పా మూవీలాగా, రజినీకాంత్ రోబో లాగా, కమల్ హసన్ దశావతారం లాగా ... గొప్ప సినిమాలు చేయాలి. ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరనే భయం అక్కర్లేదంటున్నారు క్రిటిక్స్. అందుకు బాలయ్య చారిత్రక చిత్రం, నాగ్ భక్తిరస ప్రధాన చిత్రం చేయటమే తార్కాణం అంటున్నారు!